- చెల్లింపుల విషయంలో తలెత్తిన చిక్కులే కారణం!
- 2019 తర్వాత భారత్ కొనుగోలు చేయాలనుకున్న తొలి చమురు నౌక ఇదే!
న్యూఢిల్లీ: దాదాపు ఏడేండ్ల తర్వాత భారత్‌కు రావాల్సిన ఇరాన్ ముడి చమురు నౌక ప్రయాణ మధ్యలో తన దిశను మార్చుకున్నది. అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న ‘పింగ్ షున్’ అనే షిప్ తొలుత గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు రావాల్సి ఉండగా, అనూహ్యంగా ఇప్పుడు చైనా వైపు వెళ్తున్నది. షిప్ ట్రాకింగ్ సంస్థ ‘కెప్లర్’ నివేదిక ప్రకారం, ఈ నౌక తన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్)లో గమ్యస్థానాన్ని వాడినార్ నుంచి చైనాలోని దోంగ్యింగ్‌కు మార్చుకున్నది.
చెల్లింపుల విషయంలో తలెత్తిన చిక్కులే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఉన్న 30-–60 రోజుల క్రెడిట్ సౌకర్యానికి బదులుగా, విక్రయదారులు ఇప్పుడు ముందస్తు చెల్లింపులు కోరుతున్నట్టు సమాచారం. 2019 తర్వాత భారత్ కొనుగోలు చేయాలనుకున్న తొలి ఇరాన్ చమురు రవాణా ఇదే. అమెరికా ఇటీవల ఇరాన్ చమురుపై 30 రోజుల పాటు ఆంక్షల మినహాయింపు ఇవ్వడంతో భారత్ ఈ ప్రయత్నం చేసింది.
చెల్లింపుల చిక్కుముడి
ఇరాన్ ప్రస్తుతం గ్లోబల్ బ్యాంకింగ్ నెట్‌వర్క్ స్విఫ్ట్ నుంచి దూరంగా ఉంది. దీనివల్ల అంతర్జాతీయంగా నగదు బదిలీలు చేయడం క్లిష్టంగా మారింది. గతంలో టర్కీ బ్యాంకుల ద్వారా యూరోల్లో చెల్లింపులు జరిగేవి, కానీ ప్రస్తుతం ఆ మార్గం అందుబాటులో లేదు. వాణిజ్య పరమైన నిబంధనలు, చెల్లింపుల విషయంలో స్పష్టత లేకపోవడమే ఈ నౌక మళ్లింపునకు కారణమని కెప్లర్ ప్రతినిధి సుమిత్ రితోలియా తెలిపారు. కాగా, వాడినార్‌లో రష్యా సంస్థ రోస్‌నెఫ్ట్ మద్దతు ఉన్న నయారా ఎనర్జీ రిఫైనరీ ఉంది.
ఈ నౌకలో సుమారు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉంది. ఒకవేళ చెల్లింపుల సమస్య పరిష్కారమైతే.. భవిష్యత్తులో ఈ కార్గో మళ్లీ భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. అమెరికా ఇచ్చిన ఆంక్షల మినహాయింపు గడువు ఏప్రిల్ 19తో ముగియనున్నది ప్రస్తుతం సముద్రంలో సుమారు 9.5 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ఉండగా, అందులో దాదాపు 5.1 కోట్ల బ్యారెళ్లు భారత్‌కు అనువైనవిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
