మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్స్​ఇ వేరియెంట్ కేసులు

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్స్​ఇ వేరియెంట్ కేసులు

కరోనా థర్డ్ వేవ్​ అయిపోయింది అనుకునే లోపే కొత్త వేరియెంట్​ వచ్చింది. లండన్​లో మొదటగా గుర్తించిన ఈ వైరస్​ మన దేశానికి కూడా వచ్చేసింది. పేరు ఎక్స్​ఇ వేరియెంట్.  మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్స్​ఇ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఈ వైరస్  ఒమిక్రాన్ లాంటిదేనా? పిల్లల మీద ఎఫెక్ట్ చూపుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి చాలామందికి.  

ఈ కొత్త రకం వైరస్​ ఒమిక్రాన్​లోని బిఎ1, బిఎ2 అనే రెండు రకాలతో ఏర్పడింది. ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాపిస్తుంది. ఎక్కువమందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది కూడా. మామూలు కరోనా వైరస్​తో పోల్చితే ఇది 10 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తుంది. కరోనా వైరస్​ల జీన్స్​లో ఆర్​ఎన్​ఎ(రైబోన్యూక్లియిక్ యాసిడ్) ఉంటుంది. అందుకనే ఇవి చాలా తొందరగా రూపం మార్చుకుంటాయి అని చెప్తున్నారు డాక్టర్లు.  

ఒమిక్రాన్ లాగానే... 

‘‘ఇప్పటివరకైతే ఎక్స్​ఇ వైరస్ ఇన్ఫెక్షన్​కి గురైన వాళ్లలో ఒమిక్రాన్ లక్షణాలే కనిపించాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి గుర్తించారు. ఎక్స్​ఇ వేరియెంట్​ ఇన్ఫెక్షన్​లో కొత్త లక్షణాలు ఉన్నాయని చెప్పడానికి  ఎలాంటి ఆధారాలు లేవు” అంటోంది ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ చారు దత్త అరోరా.    

వ్యాక్సిన్​తో సేఫ్

పిల్లలు తప్ప దాదాపు అందరూ కరోనా రెండు వ్యాక్సిన్లు వేసుకున్నారు. కరోనా కేసులు తగ్గడంతో మందిలో ఉన్నా కూడా మాస్క్​ పెట్టుకోవట్లేదు చాలామంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తే, కరోనా ఇన్ఫెక్షన్ రాకుండా చూడొచ్చు అంటున్నారు డాక్టర్లు.