- భారత్ నయా హిస్టరీ
- అఫ్గాన్‌పై ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో ఘన విజయం
- టెస్టు చరిత్రలోనే రికార్డు గెలుపు
- సుతార్ 6 వికెట్లతో స్పిన్ మ్యాజిక్
- రాణించిన సుందర్, కుల్దీప్, ప్రసిద్ధ్
అఫ్గానిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో నయా హిస్టరీ సృష్టించింది. ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇదే అత్యంత భారీ ఇన్నింగ్స్ విజయం.
చండీగఢ్: ముల్లన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో నయా హిస్టరీ సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పర్యాటక జట్టుకు అస్సలు అవకాశం ఇవ్వకుండా.. ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇదే అత్యంత భారీ ఇన్నింగ్స్ విజయం. అటు బ్యాటర్లు పరుగుల వరద పారించగా, ఇటు స్పిన్నర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అఫ్గాన్ బౌలర్లను దంచికొట్టింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 126 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, క్లాసిక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 100 పరుగులతో సెంచరీ కొట్టి రచ్చ లేపారు. వీరితో పాటు సాయి సుదర్శన్ (81), రిషభ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) రాణించడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
సుతార్ స్పిన్ మ్యాజిక్.. 152కే ఆలౌట్
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గానిస్థాన్ జట్టుకు ఇండియా నయా స్పిన్ సెన్సేషన్ మానవ్ సుతార్ కాలయముడిగా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో 113/5 స్కోరుతో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన అఫ్గాన్ కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. రహ్మత్ షా (60) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తన డెబ్యూ మ్యాచ్‌లోనే అద్భుత నియంత్రణతో బౌలింగ్ చేసిన సుతార్ కేవలం 33 రన్స్ ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ నడ్డి విరిచాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసి రాణించాడు.
ఫాలోఆన్‌లో వాషింగ్టన్ దెబ్బ
412 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్.. అఫ్గాన్‌ను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనైనా పర్యాటక జట్టు పోరాడుతుందేమో అనుకుంటే భారత బౌలర్లు మళ్లీ విజృంభించారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మ్యాజిక్‌తో 4 వికెట్లు (4/36) పడగొట్టి అఫ్గాన్ పనిపట్టాడు. కుల్‌దీప్ యాదవ్ (3/30) కూడా స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. మానవ్ సుతార్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. షరాఫుద్దీన్ అష్రఫ్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో 112 పరుగులకే అఫ్గాన్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. అఫ్గాన్ బ్యాటర్లలో సెదికుల్లా అటల్ (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి టెస్ట్‌లోనే 7 వికెట్లు తీసిన మానవ్ సుతర్కు ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డ్ లభించింది.
మ్యాచ్ స్కోర్ బోర్డు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 564/8 (శుభ్‌మన్ గిల్ 126, కేఎల్ రాహుల్ 100)
అఫ్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 152 పరుగులకు ఆలౌట్ (మానవ్ సుథార్ 6/33)
అఫ్ఘనిస్థాన్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్):
112 పరుగులకే ఆలౌట్
(వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు).
టెస్టుల్లో భారత్‌కు అతిపెద్ద ఇన్నింగ్స్ విజయాలు
ఇన్నింగ్స్& 300 పరుగులు (అఫ్గానిస్థాన్‌పై) ముల్లన్‌పూర్, 2026*
ఇన్నింగ్స్& 272 పరుగులు (వెస్టిండీస్‌పై) రాజ్‌కోట్, 2018
ఇన్నింగ్స్& 262 పరుగులు (అఫ్గానిస్థాన్‌పై) బెంగళూరు, 2018
ఇన్నింగ్స్& 239 పరుగులు (బంగ్లాదేశ్‌పై) మీర్పూర్, 2007
ఇన్నింగ్స్& 239 పరుగులు (శ్రీలంకపై), నాగ్‌పూర్, 2017
అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్
మ్యాచ్‌లో మొహమ్మద్ సలీమ్ సఫీ 9వ వికెట్‌గా అవుటైన తర్వాత ఆఫ్గన్ ఆలౌటైనట్లు బిగ్ స్క్రీన్‌పై వచ్చింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు కాస్త గందరగోళానికి గురయ్యారు. మరో వికెట్ ఉండగానే ఆలౌట్ ప్రకటించడంతో ఆశ్చర్యపోయారు. కానీ అంపైర్ వచ్చి 11వ స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయం కారణంగా ఆబ్సెంట్ హర్ట్ అయ్యాడని తెలిపాడు. ఒక ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకముందే, అతడు అనారోగ్యంతో లేదా గాయంతో బరిలోకి దిగకపోతే దీనిని ఏబీఎస్ హర్ట్‌గా సూచిస్తారు. దీంతో ఆఫ్గన్ ఆలౌటైనట్లు ప్రకటించారు.
