అహ్మదాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా సూపర్ పెర్ఫామెన్స్ కొనసాగుతోంది. సూపర్ –8 రౌండ్ తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఇండియాకు షాకిచ్చిన సఫారీ టీమ్.. ఇప్పుడు హార్డ్ హిట్టర్లతో కూడిన వెస్టిండీస్ పని పట్టింది. వరుసగా రెండు విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. దాంతో పాటు టీమిండియా నాకౌట్ రూట్‌ను కూడా క్లియర్ చేసింది. ఛేజింగ్‌లో కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (46 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 నాటౌట్) ముందుండి నడిపించడంతో గురువారం జరిగిన గ్రూప్–1 పోరులో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. మార్‌క్రమ్‌కు తోడు క్వింటన్ డికాక్ (24 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47), ర్యాన్ రికెల్టన్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 నాటౌట్) మెరుపులతో కరీబియన్ టీమ్ ఇచ్చిన 177 రన్స్ టార్గెట్‌ను 16.1 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఈజీగా ఛేజ్ చేసి తమ బ్యాట్ పవర్ చూపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 176/8 స్కోరు చేసింది. టాప్, మిడిలార్డర్ ఫెయిలైనా.. చివర్లో రొమారియో షెఫర్డ్ (37 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 నాటౌట్), జేసన్ హోల్డర్ (31 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49) ఎనిమిదో వికెట్‌కు 89 బాల్స్ జోడించి జట్టుకు మంచి స్కోరు అందించారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి మూడు, రబాడ, కార్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో దంచికొట్టిన మార్‌క్రమ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఆదుకున్న రొమారియో, హోల్డర్
టాస్ ఓడిన వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగగా.. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (21), షై హోప్ (16) తొలి రెండు ఓవర్లలోనే 29 రన్స్ జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. ఫస్ట్ ఓవర్లో స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌కు హోప్ 6, 4, 6తో వెల్‌కం చెప్పగా.. యాన్సెన్ వేసిన రెండో ఓవర్లో బ్రెండన్ మూడు ఫోర్లు దంచాడు. కానీ, మూడో ఓవర్ నుంచి విండీస్ కష్టాలు మొదలయ్యాయి. నాలుగు బాల్స్ తేడాలో హోప్‌తో పాటు ఫామ్‌లో ఉన్న హెట్‌మయర్ (2)ను ఔట్ చేసిన రబాడ ఆ టీమ్‌కు షాకిచ్చాడు. తర్వాతి ఓవర్లో లుంగి ఎంగిడి.. బ్రెండన్ కింగ్‌తో పాటు రోస్టన్ ఛేజ్ (2) పని పట్టడంతో 43/4తో కరీబియన్ టీమ్ కష్టాల్లో పడింది. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్స్ రావడం కష్టమైంది. ఏడో ఓవర్లో రూథర్‌ఫోర్డ్ (12)ను కార్బిన్ బాష్ పెవిలియన్ చేర్చగా.. ఎంగిడి బౌలింగ్‌లో పావెల్ (9) బ్రెవిస్‌కు చిక్కడంతో 70/6తో ఎదురీత మొదలు పెట్టింది. మాథ్యూ ఫోర్డ్ (11) ఓ ఫోర్, సిక్స్‌తో ఎదుదాడికి దిగే ప్రయత్నం చేసినా.. బాష్ వేసిన 11వ ఓవర్లో మరో షాట్‌కు ట్రై చేసి రికెల్టన్‌కు క్యాచ్ ఇవ్వడంతో 83 రన్స్‌కే ఏడు వికెట్లు కోల్పోయిన విండీస్ వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ టైమ్‌లో జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్ జట్టును ఆదుకున్నారు. సఫారీ బౌలర్లకు ఎదురొడ్డి క్రీజులో నిలిచారు. హోల్డర్ స్ట్రయిక్ రొటేట్ చేయగా.. రొమారియో భారీ షాట్లతో కౌంటర్ ఎటాక్ చేశాడు. ఎంగిడి, కేశవ్ ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టిన అతను బాష్ వేసిన 16వ ఓవర్లో 6, 4 బాదాడు. అప్పటిదాకా నెమ్మదిగానే ఆడిన హోల్డర్..యాన్సెన్ వేసిన 18వ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు సహా ఏకంగా 23 రన్స్ రాబట్టాడు. దాంతో విండీస్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. చివరి రెండు ఓవర్లలో సఫారీ టీమ్ 13 రన్స్ మాత్రమే ఇచ్చింది. ఇన్నింగ్స్ లాస్ట్ బాల్‌కు షెఫర్డ్ ఫోర్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
ప్రొటీస్ ధనాధన్
టార్గెట్ ఛేజింగ్‌లో సౌతాఫ్రికా స్టార్టింగ్ నుంచే అదరగొట్టింది. ఫామ్‌లో ఉన్న మార్‌క్రమ్ తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. రెండో ఓవర్లో రొమారియోకు 6, 4తో స్వాగతం పలికాడు. డికాక్ నెమ్మదిగా ఆడినా.. హోల్డర్ బౌలింగ్‌లో 4, 4... మాథ్యూ ఫోర్డ్ బౌలింగ్‌లో 6,4 రాబట్టడంతో ఐదు ఓవర్లకే స్కోరు 50 దాటింది. క్రీజులో కుదురుకున్న తర్వాత డికాక్ ఒక్కసారిగా జోరు పెంచాడు. షమర్ జోసెఫ్ వేసిన ఆరో ఓవర్లో 6, 4, 6 కొట్టడంతో పవర్ ప్లేను ప్రొటీస్ టీమ్ 69/0తో ముగించింది. స్పిన్నర్లు మోతీ, రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లోనూ రెండేసి ఫోర్లు, సిక్సర్లు కొట్టిన డికాక్ ఫిఫ్టీ చేసేలా కనిపించాడు. కానీ, ఛేజ్ అతడిని ఓ స్లో బాల్‌లో ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 95 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అయినా మార్‌క్రమ్ వెనక్కుతగ్గలేదు. 27 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతనికి ర్యాన్ రికెల్టన్ తోడయ్యాడు. ఈ ఇద్దరు కూడా క్రమం తప్పకుండా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ టార్గెట్‌ను కరిగించారు. రోస్టన్ ఛేజ్ వేసిన 14వ ఓవర్లో మార్‌క్రమ్ రెండు, రికెల్టన్ ఓ సిక్స్ కొట్టడంతో స్కోరు 150 దాటింది. హోల్డర్ బౌలింగ్‌లో ఫోర్‌తో మార్‌క్రమ్ గెలుపు లాంఛనం ముగించాడు.
స్కోర్‌బోర్డ్
వెస్టిండీస్: బ్రెండన్ కింగ్ (సి) డికాక్ (బి) ఎంగిడి 21, షై హోప్ (సి) డికాక్ (బి) రబాడ 16, హెట్‌మయర్ (సి) మహారాజ్ (బి) రబాడ 2, పావెల్ (సి) బ్రెవిస్ (బి) ఎంగిడి 9, ఛేజ్ (బి) ఎంగిడి 2, రూథర్‌ఫోర్డ్ (సి) డికాక్ (బి) బాష్ 12, హోల్డర్ (రనౌట్) 49, మాథ్యూ ఫోర్డ్ (సి) రికెల్టన్ (బి) బాష్ 11, రొమారియో షెఫర్డ్ (నాటౌట్) 52, గుడకేష్ మోతీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 176/8; వికెట్ల పతనం: 1-–29, 2–-31, 3-–41, 4–-43, 5–-60, 6-–71, 7-–83, 8-–172; బౌలింగ్: కేశవ్ మహారాజ్ 4–0–43–0, యాన్సెన్ 4–0–50–0, కగిసో రబాడ 4–0–22–2, లుంగి ఎంగిడి 4–0–30–3, కార్బిన్ బాష్ 4–0–31–2.
సౌతాఫ్రికా: మార్‌క్రమ్ (నాటౌట్) 82, డికాక్ (సి) హోల్డర్ (బి) ఛేజ్ 47, రికెల్టన్ (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 16.1 ఓవర్లలో 177/1; వికెట్ పతనం: 1-–95; బౌలింగ్: మాథ్యూ ఫోర్డ్ 3–0–30–0, రొమారియో షెఫర్డ్ 2–0–22–0, జేసన్ హోల్డర్ 3.1–0–31–0, షమర్ జోసెఫ్ 2–0–24–0, గుడకేష్ మోతీ 2–0–24–0, రోస్టన్ ఛేజ్ 4–0–46–1.
- 14 టీ20 వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా 21 మ్యాచ్‌ల్లో మార్‌క్రమ్ సాధించిన విజయాలు టోర్నీలో రెండో అత్యధికం. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ విలియమ్సన్ (14)రికార్డును సమం చేశాడు. ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 33 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో టాప్‌లో ఉన్నాడు.
- 264 ఈ టోర్నీలో మార్‌క్రమ్ చేసిన రన్స్. ఓ టీ20 వరల్డ్ ఎడిషన్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో కెప్టెన్‌గా రోహిత్ శర్మ (257)ను అధిగమించాడు. బాబర్ ఆజమ్ (పాకిస్తాన్–303) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
