వార్మప్‌‌ లో విండీస్‌‌ను చిత్తు చేసిన భారత్

వార్మప్‌‌ లో విండీస్‌‌ను చిత్తు చేసిన భారత్

కార్డిఫ్: మహిళల టీ20 ప్రపంచకప్ మొదటి వార్మప్ మ్యాచ్‌‌లో భారత జట్టు 26 పరుగుల తేడాతో వెస్టిండీస్‌‌ను చిత్తు చేసింది. కార్డిఫ్‌‌లో జరిగిన ఈ మ్యాచ్‌‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగుల స్కోరు సాధించింది. భారత ఇన్నింగ్స్​లో భారతీ ఫుల్మాలి 40 బంతుల్లో 56 పరుగులతో అజేయ అర్ధసెంచరీ చేసి జట్టును ఆదుకుంది.

ఓపెనర్లు స్మృతి మంధాన (39), షఫాలీ వర్మ (29) పవర్‌‌ప్లేలోనే 59 పరుగులు జోడించి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. యాస్తికా భాటియా 36 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆరుగురు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. విండీస్ బౌలర్ అఫీ ఫ్లెచర్ 4 వికెట్లు తీసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది.

ఓపెనర్ డియాండ్రా డాటిన్ (49), షెమైన్ కాంప్‌‌బెల్ (25) రాణించడంతో ఒక దశలో విండీస్ 81 పరుగులకు రెండు వికెట్లతో పటిష్టంగా కనిపించింది. భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌‌ను దెబ్బతీశారు. ముఖ్యంగా శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో కరేబియన్ల పతనాన్ని శాసించగా, రాధా యాదవ్ 3 వికెట్లు పడగొట్టింది. జూన్ 14న పాకిస్తాన్‌‌తో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌‌కు ముందు.. భారత్ తన చివరి వార్మప్ మ్యాచ్‌‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌‌తో తలపడనుంది.