షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ రెండో దశలో భారత కాంపౌండ్ జట్లు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. మెక్సికోలో జరిగిన సీజన్ ప్రారంభ వరల్డ్ కప్‌లో స్వర్ణం గెలిచిన మహిళల జట్టు, ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే టర్కీ చేతిలో 227–233 తేడాతో ఓడిపోయింది. పురుషుల జట్టు సెమీఫైనల్స్ వరకు వెళ్లినా, అమెరికా చేతిలో 234–235 తేడాతో పరాజయం పాలైంది.
కాంస్య పతక పోరులో చైనాతో జరిగిన నాటకీయ షూట్-ఆఫ్ పోరులో కూడా భారత్ ఓటమిని చవిచూసింది. ఇండివిడ్యువల్ విభాగంలో మాత్రం భారత ఆర్చర్లు మెరుగ్గా రాణించారు. పురుషుల విభాగంలో అభిషేక్ వర్మ, సాహిల్ జాదవ్, కుశాల్ దలాల్, ఓజాస్ డియోటాలే, మహిళల విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం, అదితి స్వామి, ప్రగతి, మధుర 32వ రౌండ్‌లోకి ప్రవేశించారు.
