అమెరికా వస్తువులపై ‘జీరో టారిఫ్‌’కు భారత్ ఒప్పుకున్నది: ఖతర్ వేదికగా ట్రంప్ సంచలన కామెంట్లు

అమెరికా వస్తువులపై ‘జీరో టారిఫ్‌’కు భారత్ ఒప్పుకున్నది: ఖతర్ వేదికగా ట్రంప్ సంచలన కామెంట్లు
  • యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రం భారత్​లో పెట్టొద్దని టిమ్​కుక్​కు నేనే చెప్పిన
  • ఇండియాలో ఏదైనా అమ్మడం చాలా కష్టం
  • అమెరికాలో యాపిల్ ఉత్పత్తులు పెంచేందుకు అంగీకరించారు
  • ఇండియా–పాక్​ యుద్ధాన్ని నేను ఆపలేదు... సయోధ్యకు సహకరించిన

దోహా (ఖతర్):   అమెరికా ఉత్పత్తులపై విధించే టారిఫ్‌లను ‘సున్నా’కు తగ్గించడానికి ఇండియా ఒప్పుకున్నదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇండియానే అమెరికాకు ఈ వాణిజ్య ఒప్పంద ప్రతిపాదన తీసుకొచ్చిందని తెలిపారు. అయితే,  ట్రంప్ చేసిన కామెంట్లపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. అమెరికా, ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇంకా ఏం డిసైడ్ చేయలేదని చెప్పారు. 

ట్రంప్ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనలో ఉన్నారు.  ఖతార్ రాజధాని దోహాలో గురువారం వ్యాపారవేత్తల ప్రతినిధి బృందంతో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ‘జీరో టారిఫ్’పై కామెంట్లు చేశారు. అమెరికా వస్తువులపై సుంకాలను తొలగించడానికి ఇండియా ముందుకొచ్చిందని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో ఇండియాలో ఏదైనా అమ్మడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. 

ఇండియాలో ఏర్పాటు చేయబోయే యాపిల్ తయారీ కేంద్రాల గురించి ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్‌‌‌‌తో తాను మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. ‘‘ఇండియాలో మరిన్ని ఆపిల్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను టిమ్​కుక్ విరమించుకోవాలి. అమెరికాలోనే ఆ ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలి. ఆపిల్ కంపెనీ తన ఉత్పత్తులను అమెరికాలో పెంచాలి. ఇండియా అత్యధిక టారిఫ్​లు విధించే దేశం. అక్కడ ప్లాంట్లు పెడితే లాభాలు ఉండవు. 

అమెరికాలో యాపిల్ ఉత్పత్తులు ప్రారంభిస్తే.. అన్ని విధాలుగా సహకారం అందిస్తాం. ఇండియా తన సొంత ఆర్థిక వ్యవస్థను చూసుకోగలదు. అమెరికా ఆర్థికాభివృద్ధిలో ఆపిల్ దోహదపడాలి. ఇండియాలో ఆపిల్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం నాకు ఇష్టం లేదు’’అని ట్రంప్ తెలిపారు. టిమ్ కుక్ కూడా తన ప్రపోజల్​కు ఓకే చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలోనే ఆపిల్ ఉత్పత్తులు పెంచేందుకు అంగీకరించినట్లు వివరించారు. 

సీజ్ ఫైర్​కు సహకారం అందించా

ఇండియా, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్ వేదికగా ట్రంప్ మళ్లీ సంచలన కామెంట్లు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను ఆపానని చెప్పుకోవడం లేదని, సయోధ్య కుదిర్చేందుకు మాత్రం సహకరించానని తెలిపారు.  ‘‘2రోజులు వైట్ హౌస్ నుంచి బయటికి వెళ్లకుండా ఇండియా, పాకిస్తాన్ గురించే ఆలోచించాను. కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే రెండు దేశాలతో అమెరికా వ్యాపారం ఆపేస్తుందని హెచ్చరించాను. బార్డర్​లో శాంతిని స్థాపించాలని చెప్పాను. 

దీనికి ఇండియా, పాకిస్తాన్​లు ఒప్పుకున్నాయి. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మార్కో రూబియో కీలకంగా వ్యవహరించారు. అమెరికా అడ్మినిస్ట్రేషన్ కలగజేసుకోవడంతోనే ఇండియా, పాక్  మధ్య గొడవలు ఆగిపోయాయి’’అని ట్రంప్ అన్నారు. అంతర్జాతీయ వేదికలుగా శనివారం నుంచి ఆరు సార్లు సీజ్ ఫైర్ పై ట్రంప్ కామెంట్లు చేశారు.

మోదీ స్పందించాలి: కాంగ్రెస్ 

ట్రంప్ చేసిన ‘జీరో టారిఫ్’ కామెంట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సైలెంట్​గా ఉంటే కుదరదని ఫైర్ అయ్యారు. అమెరికా వస్తువులపై జీరో టారిఫ్​కు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నదా? అని ప్రశ్నించారు. ఇండియాపై అమెరికా భారీగా టారిఫ్​లు విధిస్తుంటే.. అక్కడి వస్తువులపై జీరో టారిఫ్ ఎలా విధిస్తారని మండిపడ్డారు. అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏదో దాస్తున్నారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ నిలిపివేయడం, జీరో టారిఫ్​కు ఏదో లింక్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు.