దేశానికి జాతీయ భాష లేదు..అధికార భాషల్లో హిందీ ఒకటి : కేటీఆర్

దేశానికి జాతీయ భాష లేదు..అధికార భాషల్లో హిందీ ఒకటి : కేటీఆర్

దేశానికి జాతీయ భాష లేదని..అనేక అధికార భాషలలో హిందీ ఒకటని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీ, కేంద్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లలో హిందీని తప్పనిసరి చేయడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని..హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దామంటూ ట్వీట్ చేశారు. 

ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, నాన్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, నవోదయ విద్యాలయాల్లో హిందీ మీడియం మాత్రమే అమలు చేయాలని అమిత్ షా కమిటీ ప్రతిపాదించింది. తప్పనిసరి అనుకున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని.. అక్కడ కూడా నెమ్మదిగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని భర్తీ చేయాలని ప్రతిపాదించారు.

ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో ఇంగ్లీష్ స్థానంలో హిందీ పేపర్‌ను కంపల్సరీ చేయాలని కమిటీ సూచించింది. ఎంపిక చేసే ఉద్యోగులకు కూడా హిందీపై అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల్లోనూ హిందీ అనువాదం ఉండేలా చూడాలని.. తీర్పులు కూడా హిందీలోనే ఇచ్చే అవకాశం కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.