మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహించని భారీ ఒడిదొడుకులను చూశాయి. మెుదట స్వల్ప లాభాలతో స్టార్ట్ అయిన మార్కెట్లు కొద్ది సేపటికే ఊహించని నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో లాభాలు ఆవిరి కావటంతోపాటుగా కీలక బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో ఎరుపెక్కాయి. అయితే మధ్యాహ్నం ట్రేడింగ్ సెషన్లో అనూహ్యంగా మార్కెట్లు తిరిగి భారీ లాభాల్లోకి పుంజుకున్నాయి. దీంతో మార్కెట్ల క్లోజింగ్ నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 320 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 127 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 732 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 338 పాయింట్లు గెయిన్ అయ్యాయి.
ముందుగా ఇవాళ ఇంట్రాడేలో మార్కెట్లను అత్యధికంగా ప్రభావితం చేసిన అంశం భారత్ యూరప్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్. మథర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటున్న దీని ద్వారా భారత్ నుంచి ఎగుమతి అయ్యే 99 శాతం వస్తువులకు సుంకాల నుంచి రిలీఫ్ లభించింది. ఇదే క్రమంలో 93 శాతం వరకూ దిగుమతులపై భారం తగ్గటంతో ఫార్మా, టెక్స్ టైల్స్, కెమికల్స్, వైన్, బీర్, చీజ్, ఆటోమెుబైల్స్ వంటి రంగాలకు సానుకూలం కావటంతో ఈ రంగాల్లోని అనేక లిస్టెడ్ స్టాక్స్ లాభపడ్డాయి. పైగా దీనివల్ల రానున్న కాలంలో లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
అయితే నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ కుదుపు నుంచి ఊహించని లాభాల బాట ఎలా పట్టాయి, దానికి కీలక కారణాలు ఏంటనే విషయాలు గమనిద్దాం..
ఇండియా-ఈయూ వాణిజ్య ఒప్పందం:
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ట్రేడ్ డీల్ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఇది దీర్ఘకాలంలో ఎగుమతులు పెరగడానికి, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం 2027 నుంచి అమలులోకి రానుంది.
రూపాయి రికవరీ:
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చారిత్రక కనిష్ట స్థాయి 92 నుండి కోలుకుంది. మంగళవారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి 91.80 వద్ద ట్రేడ్ అవ్వడం మార్కెట్లకు ఊతమిచ్చింది.
గ్లోబల్ మార్కెట్ల మద్దతు:
ఆసియా మార్కెట్లైన నిక్కీ, హ్యాంగ్ సెంగ్, కోస్పీ లాభాల్లో ఉండటం.. అమెరికా మార్కెట్లు పాజిటివ్‌గా ముగియడం దేశీయ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది.
తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు:
బ్రెంట్ క్రూడ్ ధర 0.72 శాతం తగ్గి 65.12 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి, భారత వాణిజ్య లోటు తగ్గుతుందనే ఆశావహ పరిస్థితులు ఇన్వెస్టర్లను సానుకూలంగా ప్రేరేపించాయి.
అమెరికా టారిఫ్ల తగ్గింపు ఆశలు:
భారత్‌పై అదనంగా విధిస్తున్న 25 శాతం టారిఫ్లను తొలగించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చేసిన కామెంట్స్ పెట్టుబడిదారులకు భవిష్యత్తుపై ఆశలను చిగురించపజేసింది.
ఆర్బీఐ నగదు లభ్యత చర్యలు:
బ్యాంకింగ్ వ్యవస్థలోకి సుమారు 23 బిలియన్ డాలర్ల నగదును ఇన్‌ఫ్యూజ్ చేసేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు మార్కెట్లకు భారీ ఊరటనిచ్చాయి.
