24 గంటల్లో భారత్ విడిచి వెళ్లిపో: పాక్ దౌత్య అధికారికి భారత్ అల్టిమేటం

24 గంటల్లో భారత్ విడిచి వెళ్లిపో: పాక్ దౌత్య అధికారికి భారత్ అల్టిమేటం

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌ కార్యాలయంలో పని చేస్తోన్న రెహమాన్‌ అనే ఉద్యోగిపై భారత్‌ వేటు వేసింది. తన దౌత్య పాత్రకు విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినందుకు రాయబార కార్యాలయంలో ఉండే అర్హతలేని వ్యక్తిగా భారత విదేశాంగ శాఖ మంగళవారం (మే 13) ప్రకటించింది. రెహమాన్ పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం పని చేస్తున్నట్లు గుర్తించడంతో 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్‌ ఆదేశించింది. రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో గూఢచార్యం చేస్తూ భారత ఆర్మీ సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఈఏ ప్రకనటలో పేర్కొంది.

‘‘భారతదేశంలో తన అధికారిక హోదాకు అనుగుణంగా లేని కార్యకలాపాలకు పాల్పడినందుకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోపు భారత్ విడిచి వెళ్లాలని కోరాం. ఈ మేరకు పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్‌కు మంగళవారం (మే 13) ఆదేశాలు జారీ చేశాం’’ అని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. 

పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్‎తో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అనంతరం అమెరికా జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో ప్రతిష్టంభన తొలిగిపోయింది. ఆ వెంటనే పాక్ దౌత్య అధికారిపై భారత్ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.