
బీల్ (స్విట్జర్లాండ్): ఇండియా టెన్నిస్ టీమ్.. తొలిసారి డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. శనివారం (సెప్టెంబర్ 13) ముగిసిన వరల్డ్ గ్రూప్–1 పోరులో ఇండియా 3–1తో స్విట్జర్లాండ్‌పై గెలిచింది. మెన్స్ డబుల్స్‌లో ఎన్. శ్రీరామ్ బాలాజీ–రుత్విక్ బొల్లిపల్లి 7–6 (7/3), 4–6, 5–7తో జాకుబ్ పాల్–డొమ్నిక్ స్ట్రికెర్ చేతిలో ఓడినా.. రివర్స్ సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 6–1, 6–3తో హెన్రీ బెర్నెట్‌పై గెలిచి ఇండియాను ముందుకు తీసుకెళ్లాడు.
షెడ్యూల్ ప్రకారం నాలుగో మ్యాచ్‌లో సుమిత్.. జెరోమ్ కైమ్‌తో తలపడాల్సి ఉంది. కానీ స్విస్‌కు చావో రేవో మ్యాచ్ కావడంతో జూనియర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంప్ అయిన బెర్నెట్‌ను బరిలోకి దించింది. 2023 సెప్టెంబర్‌లో మొరాకోతో జరిగిన మ్యాచ్ తర్వాత నగాల్ ఆడిన తొలి డేవిస్ కప్ పోరు ఇదే. ఇక32 ఏళ్ల తర్వాత ఒక యూరోపియన్ టీమ్‌పై ఇండియాకు ఇది తొలి విజయం కావడం విశేషం.
1993లో క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓడారు. 2022లో ఢిల్లీలో జరిగిన గ్రాస్ కోర్టులో డెన్మార్క్‌ను ఓడించారు. వచ్చే ఏడాది జనవరిలో డేవిస్ కప్ క్వాలిఫయర్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.