
మన దేశంలో తొలిసారిగా నెలవారీ నిరుద్యోగ రేటును కేంద్ర గణాంకాలు, పథకాల అమలుశాఖ 2025, మే 15న విడుదల చేసింది. ఇప్పటివరకు త్రైమాసికం, వార్షిక వారీగా గణాంకాలనే ప్రభుత్వం విడుదల చేసింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం 2025, ఏప్రిల్లో నిరుద్యోగ రేటు 5.1 శాతంగా నమోదైంది. ఈ నివేదిక ప్రధాన లక్ష్యం దేశంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న వ్యక్తుల్లో ఎంత శాతం మంది నిరుద్యోగంతో ఉన్నారో వెంటనే తెలియజేయడం.
- మహిళల(5 శాతం)తో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువ మంది(5.2 శాతం)కి ఉద్యోగం లేదు. అంటే పురుషుల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నది.
- 15–29 ఏండ్ల వయసు ఉన్న వారిలో నిరుద్యోగ రేటు 13.8 శాతంగా నమోదు అయింది.
- పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు తక్కువ. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 17.2 శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 12.3శాతంగా ఉన్నది.
- 15–29 ఏండ్లలోని మహిళల్లో నిరుద్యోగ రేటు దేశవ్యాప్తంగా(పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కలిపి) 14.4 శాతంగా ఉన్నది. విడిగా చూస్తే పట్టణాల్లో 23.7శాతం, గ్రామాల్లో 10.7 శాతంగా ఉన్నది.
- 15–29 వయసులోని పురుషుల్లో మొత్తం మీద 13.6 శాతం నిరుద్యోగ రేటు ఉండగా, పట్టణాల్లో 15 శాతం, గ్రామాల్లో 13 శాతంగా నమోదు అయింది.
- 15 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రజల్లో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు(ఎల్ఎఫ్ పీఆర్) ఏప్రిల్ లో 55.6 శాతంగా నమోదైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం, పట్టణాల్లో 50.7 శాతంగా ఉన్నది.