
దాదాపు 35ఏళ్ళ తర్వాత అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) గవర్నింగ్ బాడీ ఛైర్మన్ బాధ్యతలు భారత్ చేపట్టింది. భారత్ కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఈ పదవికి ఎన్నికయ్యారు. ఈ ఏడాది అక్టోబరు నుండి వచ్చే ఏడాది జూన్ వరకు ఈ పదవీ కాలం వుంటుందని కార్మిక మంత్రిత్వ శాఖ శుక్రవారం(అక్టోబర్-23) తెలిపింది.
ILO గవర్నింగ్ బాడీ ఛైర్మన్ కు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉంటుంది. ILO విధానాలు, కార్యక్రమాలు, ఎజెండా, బడ్జెట్ అన్నింటినీ గవర్నింగ్ బాడీ నిర్ణయిస్తుంది. డైరెక్టర్ జనరల్‌ను కూడా ఎన్నుకుంటుంది. ప్రస్తుతం ఐఎల్‌ఓలో 187మంది సభ్యులు వున్నారు. నవంబరులో జరగనున్న గవర్నింగ్ బాడీ సమావేశానికి అపూర్వ చంద్ర అధ్యక్షత వహిస్తారు. 1988 IAS బ్యాచ్ అయిన చంద్ర మహారాష్ట్ర కేడర్. పెట్రోలియం, ఖనిజవాయువు శాఖలో ఎనిమిదేళ్ళకు పైగా పనిచేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో నాలుగేళ్ళ పాటు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా వున్నారు. ఆయుధ సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా భారత సాయుధ బలగాలను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే 2017 డిసెంబరు 1న రక్షణ శాఖలో డైరెక్టర్ జనరల్ (అక్విజిషన్)గా చేరారు.