
- రెండో ఇన్నింగ్స్‌లో 146 రన్స్‌కే వెస్టిండీస్ ఆలౌట్
- దెబ్బకొట్టిన జడేజా, సిరాజ్
అహ్మదాబాద్: సొంతగడ్డపై ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన టీమిండియా రెండున్నర రోజుల్లోనే వెస్టిండీస్ పని పట్టింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. బ్యాట్‌తో సెంచరీ కొట్టిన వైస్ -కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (4/54) బాల్‌తోనూ మ్యాజిక్ చేశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడంతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన ఇండియా రెండు టెస్టుల సిరీస్‌లో 1-–0 ఆధిక్యంలో నిలిచింది. ఈ వన్ సైడ్ మ్యాచ్‌లో గిల్‌సేన తొలి ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 448/5 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 286 రన్స్ భారీ లోటుతో మూడో రోజు, శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ మరోసారి బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది.
ఇండియా బౌలర్ల ధాటికి 45.1 ఓవర్లలో 146 రన్స్‌కే కుప్పకూలింది. అలిక్ అథనేజ్(38), జస్టిన్ గ్రీవ్స్ (25), జైడెన్ సీల్స్ (22) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు. జడేజాకు తోడు పేసర్ మహ్మద్ సిరాజ్ (3/31) కూడా విండీస్ పతనాన్ని శాసించాడు. జడ్డూకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 10 నుంచి ఢిల్లీలో జరగనుంది.
ఒకటిన్నర సెషన్లలోనే విండీస్ ఖేల్ ఖతం
మూడో రోజు ఉదయమే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇండియా స్పిన్నర్లను రంగంలోకి దించింది. పిచ్‌పై లభించిన టర్న్‌ను, రఫ్ ప్యాచెస్‌ను ఉపయోగించుకుంటూ విండీస్ బ్యాటర్లను ఆతిథ్య బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. పేసర్ సిరాజ్ వేసిన షార్ట్ బాల్‌ను త్యాగ్‌నరైన్ చందర్‌పాల్ (8) పుల్ చేయగా, స్క్వేర్ లెగ్‌లో నితీశ్ రెడ్డి అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో ఇండియాకు తొలి
వికెట్‌ను అందించాడు.
ఆ తర్వాత జడేజా తన స్పిన్ మాయాజాలంతో కరీబియన్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. జాన్ క్యాంప్‌బెల్ (14), బ్రెండన్ కింగ్ (5), షై హోప్ (6)ను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపాడు. మధ్యలో విండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ (1)ను కుల్దీప్ యాదవ్ (2/23) క్లీన్ బౌల్డ్ చేయడంతో లంచ్ సమయానికి విండీస్ 66/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత కూడా ఆ జట్టు ఆట మారలేదు. ఓ ఎండ్‌లో ఒంటరి పోరాటం చేస్తున్న అలిక్ అతానజేను వాషింగ్టన్ సుందర్ (1/18) వెనక్కు పంపాడు. ఆ వెంటనే సిరాజ్ ఒకే ఓవర్లో జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్ (0)ను ఔట్ చేసి విండీస్ ఓటమిని ఖాయం చేశాడు. చివర్లో జేడెన్ సీల్స్ కొద్దిసేపు ప్రతిఘటించాడు. కానీ, కుల్దీప్ యాదవ్ అతడిని పెవిలియన్ చేర్చడంతో విండీస్ కథ ముగిసింది.