విక్టరీతో మొదలైన న్యూఇయర్ : లంకపై టీమిండియా ఘన విజయం

విక్టరీతో మొదలైన న్యూఇయర్ : లంకపై టీమిండియా ఘన విజయం

లంకతో – రెండో టీ20లో టీమిండియా గ్రాండ్​ విక్టరీ. రాణించిన రాహుల్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్.
విక్టరీతో మొదలైన న్యూఇయర్ లంకతో – రెండో టీ20లో టీమిండియా గ్రాండ్​ విక్టరీ.
రాణించిన రాహుల్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్.

టీ20ల్లో కనిపించే ధనాధన్‌‌ షాట్లు లేవు..! కళ్లు బైర్లు కమ్మే బౌలింగ్‌‌ దృశ్యాలు లేవు..! మెరుపులా మెరిసే ఫీల్డింగ్‌‌ విన్యాసాలూ లేవు..! తొలి మ్యాచ్‌‌ వర్షార్పణం కావడంతో.. కనీసం రెండో టీ20లోనైనా పోటీ ఉంటుందని భావించినా.. అంతా ఏకపక్షమే..! గతేడాదిని మురిపిస్తూ.. కొత్త సీజన్‌‌లోనూ టీమిండియా బౌలర్లు మెప్పించారు..! మనకంటే తక్కువ స్థాయి ప్రత్యర్థిపై జూలు విదిలిస్తూ.. టపటపా వికెట్లు పడగొట్టి లంకేయులను వణికించారు..! ఫలితంగా కొత్త ఏడాది.. షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో అలవోక విజయంతో బోణీ చేశారు..!!

ఇండోర్‌‌: రెండో టీ20లో ఇండియా ఘన విజయం సాధించింది. బౌలింగ్‌‌లో శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (3/23), నవదీప్​ సైనీ (2/18), బ్యాటింగ్‌‌లో.. కేఎల్‌‌ రాహుల్‌‌ (32 బంతుల్లో 6 ఫోర్లతో 45), శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 34), కోహ్లీ (17 బంతుల్లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 30 నాటౌట్‌‌) దుమ్మురేపడంతో.. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 రన్స్‌‌ చేసింది. టాపార్డర్​లో కుశాల్‌‌ పెరీరా (28 బంతుల్లో 3 సిక్సర్లతో 34), అవిష్క ఫెర్నాండో (16 బంతుల్లో 5 ఫోర్లతో 22), గుణతిలక (21 బంతుల్లో 3 ఫోర్లతో 20) రాణించారు. లోయరార్డర్‌‌లో హసరంగ (10 బంతుల్లో 3 ఫోర్లతో 16 నాటౌట్‌‌) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 144 రన్స్‌‌ చేసింది. సైనీకి ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 శుక్రవారం పుణెలో జరుగుతుంది.

పడుతూ.. లేస్తూ..

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన లంకకు మెరుగైన ఆరంభమే దక్కింది. పవర్‌‌ప్లేలో గుణతిలక, అవిష్క ఫెర్నాండో  భారీ షాట్లు కొట్టకపోయినా.. ఎనిమిది ఫోర్లు బాదడంతో మంచి స్కోరే వచ్చింది. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ లైన్‌‌ దాటించిన అవిష్క.. ఐదో ఓవర్‌‌లో వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. రెండు ఓవర్ల తర్వాత సైనీ దెబ్బకు గుణతిలక పెవిలియన్‌‌ చేరడంతో లంక 54/2తో నిలిచింది. అయితే ఎనిమిదో ఓవర్‌‌ ఐదో బాల్‌‌ను పాయింట్‌‌లోకి ట్యాప్‌‌ చేసిన ఒషాడా ఫెర్నాండో (10) తృటిలో రనౌట్‌‌ మిస్సయ్యాడు. అయ్యర్‌‌ బాల్‌‌ను రాంగ్‌‌ సైడ్‌‌ త్రో చేయడంతో వికెట్‌‌ దక్కలేదు. సుందర్‌‌ బౌలింగ్‌‌లో తొలి సిక్స్‌‌తో కుశాల్‌‌ పెరీరా టచ్‌‌లోకి వచ్చాడు. ఫలితంగా తొలి 10 ఓవర్లలో లంక 67/2 స్కోరు సాధించింది. ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన కుల్దీప్‌‌ మంచి టర్న్‌‌తో ఆకట్టుకున్నాడు. తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి స్కోరుకు కళ్లెం వేశాడు.12వ ఓవర్‌‌ (కుల్దీప్‌‌) తొలి బంతికి పెరీరా భారీ సిక్సర్‌‌తో రెచ్చిపోయినా.. మూడో బాల్‌‌కు ఫెర్నాండో  స్టంపౌట్‌‌ అయ్యాడు. సరిగ్గా 14వ ఓవర్‌‌ తొలి బాల్‌‌ను సిక్సర్‌‌గా మలిచిన పెరీరా.. రెండో బాల్‌‌కు లాంగాన్‌‌లో ధవన్‌‌ చేతికి చిక్కాడు. 15వ ఓవర్‌‌లో రాజపక్స (9) కూడా వెనుదిరిగాడు. 21 బాల్స్‌‌లో 3 వికెట్లు పడటంతో లంక స్కోరు 104/5గా మారింది. 17వ ఓవర్‌‌లో బుమ్రా వేసిన పర్‌‌ఫెక్ట్‌‌ లెంగ్త్‌‌కు షనక (7) వికెట్‌‌ ఎగిరింది. అప్పటికే డీలా పడిన లంకేయులను 19వ ఓవర్‌‌లో ఠాకూర్‌‌ (3/23) ఘోరమైన దెబ్బ కొట్టాడు. హసరంగ నిలకడగా ఆడినా.. ఆరు బంతుల వ్యవధిలో  డి సిల్వా (17), ఉడాన (1), మలింగ (0)ను ఔట్ చేసి స్కోరును కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్‌‌లో హసరంగ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో లంక ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. సుందర్, కుల్దీప్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.

నలుగురూ దంచారు..

భారీ టార్గెట్‌‌ కాకపోయినా..ఇండియా ఓపెనర్లు రాహుల్‌‌, ధవన్‌‌ (29 బంతుల్లో 2 ఫోర్లతో 32) దుమ్మురేపారు. తొలి రెండు ఓవర్లలో 16 రన్స్‌‌తో సరిపెట్టుకున్నా.. మూడో ఓవర్‌‌ నుంచి బౌండరీల మోత మొదలైంది. మలింగ వేసిన ఈ ఓవర్‌‌లో రాహుల్‌‌ రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాతి ఓవర్‌‌లో ఫోర్‌‌, ఐదో ఓవర్‌‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌‌ప్లే ముగిసే సరికి ఇండియా స్కోరు 54/0కు చేరింది. ఫీల్డింగ్‌‌ పెరిగాకా.. వేగంగా సింగిల్స్‌‌ తీస్తూ రన్‌‌రేట్‌‌ తగ్గకుండా చూశారు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని 10వ ఓవర్‌‌లో హసరంగ విడగొట్టాడు. అద్భుతమైన గూగ్లీతో రాహుల్‌‌ను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేయడంతో తొలి వికెట్‌‌కు 71 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. వన్​డౌన్​లో వచ్చిన శ్రేయస్‌‌ కుదురుకునేలోపే.. హసరంగ.. ధవన్‌‌ను ఔట్‌‌ చేయడంతో ఇండియా స్కోరు 86/2గా మారింది. స్ట్రయిట్‌‌ బాల్‌‌ను ధవన్‌‌ డిఫెన్స్‌‌ చేయబోయి వికెట్ల ముందు దొరికాడు. ఫీల్డ్‌‌ అంపైర్‌‌ ఔట్‌‌ ఇవ్వకపోయినా రివ్యూలో లంక నెగ్గింది. ఈ దశలో కోహ్లీ నెమ్మదిగా ఆడినా తర్వాత బ్యాట్‌‌ ఝుళిపించాడు. అప్పటివరకు మెల్లగా ఆడిన అయ్యర్‌‌.. హసరంగ వేసిన 16వ ఓవర్‌‌లో 4, 4, 6తో 17 రన్స్‌‌ పిండుకున్నాడు. తర్వాతి ఓవర్‌‌లో కోహ్లీ కూడా 6, 4తో 16 రన్స్‌‌ రాబట్టడంతో ఇండియా విజయ సమీకరణం 18 బంతుల్లో 6 పరుగులుగా మారింది. 18వ ఓవర్‌‌ తొలి బాల్‌‌కు అయ్యర్‌‌ ఔటైనా.. కోహ్లీ సూపర్‌‌ సిక్స్‌‌తో లాంఛనం ముగించాడు. విరాట్‌‌, అయ్యర్‌‌ మధ్య మూడో వికెట్‌‌కు 51 రన్స్‌‌ సమకూరాయి.

స్కోరు బోర్డు

శ్రీలంక: గుణతిలక (బి) సైనీ 20, ఆవిష్క ఫెర్నాండో (సి) సైనీ (బి) సుందర్‌‌ 22, కుశాల్‌‌ పెరీరా (సి) ధవన్‌‌ (బి) కుల్దీప్‌‌ 34, ఒషాడ ఫెర్నాండో (స్టంప్‌‌) పంత్‌‌ (బి) కుల్దీప్‌‌ 10, రాజపక్స (సి) పంత్‌‌ (బి) సైనీ 9, షనక (బి) బుమ్రా 7, డి సిల్వా (సి) దూబే (బి) ఠాకూర్‌‌ 17, హసరంగ (నాటౌట్‌‌) 16, ఉడాన (సి) సైనీ (బి) ఠాకూర్‌‌ 1, మలింగ (సి) కుల్దీప్‌‌ (బి) ఠాకూర్‌‌ 0, కుమార (నాటౌట్‌‌) 0, ఎక్స్‌‌ట్రాలు:6,  మొత్తం: 20 ఓవర్లలో 142/9.

వికెట్లపతనం: 1–38, 2–54, 3–82, 4–97, 5–104, 6–117, 7–128, 8–130, 9–130.

బౌలింగ్‌‌: బుమ్రా 4–0–32–1, ఠాకూర్‌‌ 4–0–23–3, సైనీ 4–0–18–2, సుందర్‌‌ 4–0–29–1, కుల్దీప్‌‌ 4–0–38–2.

ఇండియా: రాహుల్‌‌ (బి) హసరంగ 45, ధవన్‌‌ (ఎల్బీ) హసరంగ 32, శ్రేయస్‌‌ (సి) షనక (బి) కుమార 34, కోహ్లీ (నాటౌట్‌‌) 30, పంత్‌‌ (నాటౌట్‌‌) 1, ఎక్స్‌‌ట్రాలు: 2, మొత్తం: 17.3 ఓవర్లలో 144/3.

వికెట్లపతనం: 1–71, 2–86, 3–137.

బౌలింగ్‌‌: మలింగ 4–0–41–0, కుమార 3.3–0–30–1,డి సిల్వా 2–0–15–0, షనక 4–0–26–0, హసరంగ 4–0–30–2.