జీడీపీ .. గ్రేట్​గ్రోత్ .. మూడో క్వార్టర్​లో 8.4 శాతం పెరుగుదల

జీడీపీ .. గ్రేట్​గ్రోత్ .. మూడో క్వార్టర్​లో 8.4 శాతం పెరుగుదల
  • ఈ ఏడాది 7.6 శాతం గ్రోత్​సాధ్యమని అంచనా

న్యూఢిల్లీ: ఎనలిస్టుల అంచనాలను అధిగమిస్తూ, మనదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మూడో క్వార్టర్​లో (అక్టోబర్–-డిసెంబర్) వార్షిక ప్రాతిపదికన 8.4 శాతం బలమైన వృద్ధిని సాధించింది. మాన్యుఫాక్చరింగ్​, రియల్టీ సెక్టార్లు దూకుపోవడంతో ఈ ఘనత సాధ్యమైంది. మైనింగ్, కన్​స్ట్రక్షన్​ వంటి సెక్టార్లు రెండంకెల గ్రోత్​ను సాధించాయి. వ్యవసాయ రంగం మాత్రం 0.8 శాతం తగ్గింది. కరెంటు, గ్యాస్​, నీటి సరఫరా వంటి సేవా రంగాలు వృద్ధి చెందాయి.  గత క్వార్టర్​లో జీడీపీ  8.1 శాతంగా నమోదైందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్​ఎస్​ఓ) గురువారం వెల్లడించింది.

 దీంతో 2024 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​ జీడీపీ అంచనాలను 8.2 శాతానికి, రెండో క్వార్టర్​ అంచనాలను 8.2 శాతానికి పెంచారు. గతంలో ఈ అంచనాలు వరుసగా 7.8 శాతం, 7.6 శాతం ఉండేవి.   2024 ఆర్థిక సంవత్సరం అంచనాలను కూడా 7 శాతం నుంచి 7.6 శాతానికి పెంచారు. మూడవ క్వార్టర్​లో ఆర్థిక వ్యవస్థ 6.6 శాతం వృద్ధి చెందుతుందని ఎకనమిస్టులు అంచనా వేశారు.  

ఇదిలా ఉండగా, ఇదే కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బీఐ) వృద్ధి రేటును 6.5 శాతంగా అంచనా వేసింది. మందగించిన తయారీ రంగం,  బలహీనమైన వినియోగం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్-–డిసెంబర్ కాలంలో మొదటిసారిగా ఆర్థిక వృద్ధి 7 శాతం కంటే తక్కువకు పడిపోతుందని రాయిటర్స్ పోల్ అంచనా వేసింది. అయితే తాజా లెక్కలు అందుకు భిన్నంగా ఉన్నాయి.  మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్​ఐక్యూ డిసెంబర్ క్వార్టర్​లో భారతీయ వినియోగ వస్తువుల విభాగంలో అమ్మకాలు మందగించాయని వెల్లడించింది. రిటైలర్లు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక జీవన వ్యయం కారణంగా కరోనా ఎఫెక్ట్​ నుంచి కోలుకోవడం నెమ్మదించింది.

 ఖర్చులు,  తక్కువ వేతన పెరుగుదల ఇందుకు కారణాలు. దీంతో  హిందూస్థాన్ యూనిలీవర్,  బ్రిటానియా ఇండస్ట్రీస్ వంటి ఎఫ్​ఎంసీజీ కంపెనీలు నష్టపోయాయి. వీటి క్వార్టర్లీ లాభాలు బాగా తగ్గాయి. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ గ్రోత్ మన ఆర్థిక వ్యవస్థ సత్తాను చాటిందని ప్రశంసించారు. మన ఎకానమీని పరుగులు పెట్టించేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ నాణ్యమైన జీవితాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని స్పష్టం చేశారు.