ఎకో ఫ్రెండ్లీగా ఎన్నికలు

ఎకో ఫ్రెండ్లీగా ఎన్నికలు

న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్​విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈసారి ఎన్నికలను ఎకోఫ్రెండ్లీగా నిర్వహించేందుకు ఎలక్షన్​​ కమిషన్​ ఆఫ్​ఇండియా (ఈసీఐ) నిర్ణయించింది. సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. అలాగే, పేపర్​ వాడకాన్ని తగ్గించడంతోపాటు సిబ్బందిని తరలించేందుకు ఎకోఫ్రెండ్లీ వాహనాలనే వాడాలని, కార్​పూలింగ్ (ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణం)​ పాటించాలని ఎన్నికల యంత్రాంగానికి, రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలు జారీచేసింది.

పర్యావరణ అనుకూలంగా ఎన్నికలు నిర్వహించేలా ఈసీఐ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ రాజీవ్​కుమార్​ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో వ్యర్థాల నిర్వహణపై పక్కా మార్గదర్శకాలు జారీచేసినట్టు చెప్పారు. ఓటర్​ లిస్ట్​, ఎన్నికల సమాచార ముద్రణకు  పేపర్​ వాడకాన్ని తగ్గించేందుకు డబుల్​సైడ్​ ప్రింటింగ్​కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు తెలిపారు.

కార్బన్​ ఫుట్​ప్రింట్​ను తగ్గించేందుకు తక్కువ సంఖ్యలో వాహనాలు వాడాలని, పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ను వినియోగించుకోవాలని, ప్రచార కార్యక్రమాలకోసం పునరుత్పాదక శక్తివనరులను వినియోగించుకోవాలని, దూరం తగ్గించేందుకు పోలింగ్​ కేంద్రాలను ఏకీకృతం చేయాలని ఎన్నికల యంత్రాంగంతోపాటు రాజకీయ పార్టీలను కోరారు. ఏప్రిల్​ 19న 543 లోక్​సభ స్థానాలకు 7 దశల్లో పోలింగ్​ ప్రారంభం కానున్నది. తొలి దశలో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్​ 4న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.