ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక

ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక

ఢిల్లీ : ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ వెళ్తున్న వారికి, ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులకు కీలక సూచనలు చేసింది. అనవసర ప్రయాణాలు వద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.  

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై మళ్లీ రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులను హెచ్చరించింది. ఉక్రెయిన్‌ ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీ చేసిన నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని కోరింది. ఉక్రెయిన్‌లో భారతీయులు తమ పరిస్థితులను రాయబార కార్యాలయానికి తెలియజేయాలని సూచించింది.

రష్యా- క్రిమియాలను అనుసంధానం చేసే కెర్చ్‌ రోడ్డు, రైలు వంతెనపై ఇటీవల భారీ పేలుడు సంభవించింది. క్రిమియాకి జీవనాడిగా ఉన్న ఈ వంతెన పేల్చివేయడంపై రష్యా తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీని వెనుక ఉక్రెయిన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం హస్తం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపించిన మరుసటి రోజే క్రెమ్లిన్‌ సేనలు కీవ్‌ సహా పలు నగరాలపై క్షిపణులతో దాడికి దిగాయి. ఈ ఘటనలో ప్రాణనష్టంతో పాటు రోడ్లు, భవనాలు, వాహనాలు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి.