ప్రపంచ ఆకలి సూచీలో 107వ స్థానానికి పడిపోయిన ఇండియా

 ప్రపంచ ఆకలి సూచీలో 107వ స్థానానికి పడిపోయిన ఇండియా

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్ఐ) లో ఇండియా 107వ స్థానానికి పడిపోయింది. మొత్తం 121 దేశాల జాబితాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ మన కన్నా ముందున్నాయి. చైనా, తుర్కియే, కువైట్ టాప్ ప్లేస్ లో నిలిచాయని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్ సైట్ శనివారం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహారలోపంపై జీపీఐ సర్వే చేస్తుంది. ఐరిస్ సంస్థ కన్సర్న్ వరల్డ్ వైడ్, జర్మనీ సంస్థ వెల్ట్ హంగర్ హిల్ఫే కలిసి ఈ రిపోర్టును తయారు చేశాయి. ఇండియా జీహెచ్ఐ స్కోరు కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2000 సంవత్సరంలో మన దేశ స్కోరు 38.8 ఉండగా.. 2014 నుంచి 2022 మధ్య కాలంలో అది 28.2 నుంచి 29.1 వద్ద నిలిచిందని రిపోర్టు వెల్లడించింది.

తప్పుబట్టిన కేంద్రం..
హంగర్​ ఇండెక్స్ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. అశాస్త్రీయ పద్ధతిలో రిపోర్టు తయారుచేశారని, గ్రౌండ్​ రియాలిటీకి ఇది వ్యతిరేకంగా ఉందని ఆరోపించింది. ఈ రిపోర్టు మొత్తం నాలుగు అంశాల ఆధారంగా తయారుచేశారు. నాలుగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవే.. మొత్తం దేశ జనాభాకు వాటి ఫలితాలను ఆపాదించడం సరికాదని పేర్కొంది. అవికూడా సైంటిఫిక్​ పద్ధతిలో నిర్వహించినవి కాదని తెలిపింది. కేవలం 3 వేల మందిపై నిర్వహించిన ఒపీనియన్​ పోల్​లో వెల్లడైన అభిప్రాయాలేనని ఓ ప్రకటనలో వెల్లడించింది.