
ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం (సెప్టెంబర్ 21) జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెటర్లు హరిస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ హద్దు మీరు ప్రవర్తించిన సంగతి తెలిసిందే. సూపర్-4 మ్యాచ్ లో భాగంగా వీరిద్దరూ తమ సైగలతో వివాదాల్లో ఇరుక్కున్నారు. రౌఫ్, ఫర్హాన్ లపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరూ రెచ్చగొట్టే హావభావాలు ప్రదర్శించారని ఐసీసీకి బీసీసీఐ బుధవారం (సెప్టెంబర్ 24) అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఐసీసీకి బీసీసీఐ ఈ-మెయిల్ రూపంలో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఇద్దరు పాక్ క్రికెటర్లపై ఐసీసీ విచారణ జరిపే అవకాశం ఉంది. విచారణ కోసం వారు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ముందు హాజరు కావాల్సి రావచ్చు.
ఫీల్డింగ్ చేస్తూ రౌఫ్ వక్రబుద్ధి:
ఆదివారం (సెప్టెంబర్ 21) సూపర్-4లో భాగంగా ఇండియా ఛేజింగ్ చేస్తున్నప్పుడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ రౌఫ్ ఓవరాక్షన్ చేశాడు. స్టేడియంలో టీమిండియా ఫ్యాన్స్ 2022 టీ20 వరల్డ్ కప్ లో రౌఫ్ బౌలింగ్ విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు ఈ పాక్ పేసర్ కు గుర్తు చేశారు. ఆ తర్వాత రౌఫ్ సంజ్ఞలు వివాదాస్పదంగా మారాయి. ఒక ఫైటర్ జెట్ గాల్లో ఎగురుతూ, సడెన్‌గా కూలిపోయినట్లు యాక్షన్ చేశాడు. భారత్‌కు చెందిన 6 రఫెల్ జెట్ ఫ్లైట్స్‌ను కూల్చామని, యుద్దంలో తమదే విజయమని పేర్కొంటూ 6-0 సైగలు చేశాడు. అంతకు ముందు విమానాన్ని కూల్చేసినట్లు కూడా సైగలు చేశాడు. రౌఫ్ సైగలు మ్యాచ్ తర్వాత తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
సాహిబ్‌జాదా ఫర్హాన్ గన్ సెలెబ్రేషన్:
ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన గన్ సెలెబ్రేషన్ వైరల్ గా మారింది. ఆరంభం నుంచి అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఈ పాక్ ఓపెనర్ హాఫ్ సెంచరీ తర్వాత ఓవరాక్షన్ తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ మూడో బంతికి అక్షర్ పటేల్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఫర్హాన్ తన బ్యాట్ ను గన్ లా చూపిస్తూ సెలెబ్రేషన్ చేసుకున్నాడు.
ALSO READ : ఇండియాతో ఫైనల్ ఆడే జట్టేది.. కాసేపట్లో బంగ్లా, పాక్‌ల మధ్య నాకౌట్ పోరు
పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ అతని సెలెబ్రేషన్ కు తెగ చప్పట్లు కొట్టారు. ఫర్హాన్ చేసిన గన్ సెలెబ్రేషన్ పాకిస్తానీ ఉగ్రవాదులు ఇండియాపై చేసిన పహల్గామ్ ఎటాక్ ను గుర్తు చేసింది. ఫర్హాన్ చేసిన గన్ సెలెబ్రేషన్ పై ఇండియన్ ఫ్యాన్స్ బీసీసీఐ, భారత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తానీ ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది అమాయకులను ఎలా ఊచకోత కోశారో సాహిబ్‌జాదా ఫర్హాన్ మైదానంలో చూపిస్తున్నడంటూ ట్వీట్స్ పెడుతున్నారు. ఐసీసీ విచారణలో వీరిద్దరూ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ సైగలు చేస్తే వారికి రెండు నెలల బ్యాన్ విధించే అవకాశం ఉంది.