మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ.. కొత్త మార్గాలను అన్వేషిస్తున్నరు : ప్రధాని మోడీ

మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ.. కొత్త మార్గాలను అన్వేషిస్తున్నరు : ప్రధాని మోడీ

భారతదేశం మహిళా అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి చేరే స్థితికి వెళ్లిందని ప్రధాని మోడీ చెప్పారు. మహిళలలంటే గౌరవం పెరిగితేనే  దేశం ముందుకు సాగుతుందని మోడీ పిలుపునిచ్చారు. 'మహిళల ఆర్థిక సాధికారత'పై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలకు సమానమైన గౌరవం, సమానత్వ భావనను పెంచడం ద్వారానే  భారతదేశం ముందుకు సాగుతుందన్నారు.  గత 9,-10 సంవత్సరాలలో చదువుకుంటున్న బాలికల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌లలో బాలికల నమోదు నేడు 43 శాతంగా ఉందని, ఇది అమెరికా, యూకే, జర్మనీ వంటి దేశాల కంటే ఎక్కువని మోడీ కొనియాడారు.

వైద్యం, క్రీడలు, వ్యాపారం, రాజకీయాలు వంటి రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరగడమే కాకుండా వాళ్లు మంచి ఫలితాలను సాధిస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌లో మహిళలకు 7.5 శాతం వడ్డీ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా మహిళా సాధికారతలో ఒక ముందడుగు అని మోడీ అన్నారు. మూడు కోట్ల ఇళ్లలో ఎక్కువ భాగం మహిళల పేరు మీదనే ఉన్నాయన్న ఆయన..  మహిళలు తమ కుటుంబాల ఆదాయాన్ని పెంచడమే కాకుండా దేశానికి కొత్త ఆర్థిక మార్గాలను కూడా అన్వేషిస్తున్నారని తెలిపారు. ముద్రా రుణం పొందుతున్న వారిలో దాదాపు 70 శాతం మంది మహిళలేనని ప్రధాని చెప్పారు.  ప్రభుత్వం నిర్వహిస్తున్న 12 పోస్ట్-బడ్జెట్ వెబ్‌నార్లలో ఇది 11వది. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఆలోచనలు, సూచనలు చేయడం ఈ వెబ్‌నార్‌ల లక్ష్యం.