
న్యూఢిల్లీ: ఇటీవల ఇండియాపై విషం చిమ్ముతున్న వైట్ వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఫైర్ అయ్యింది. ఇండియాపై నవారో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పుదోవ పట్టించేవని పేర్కొంది.
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ల ద్వారా ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తుందని ఇండియాపై అక్కసు వెళ్లగక్కాడు నవారో. రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి గణనీయమైన లాభంతో యూరప్, ఆఫ్రికా, ఆసియా మార్కెట్లకు రష్యన్ చమురును తిరిగి భారత్ విక్రయిస్తోందని ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను "మోడీ యుద్ధం"గా అభివర్ణించిన నవారో. ఇక్కడితో ఆగకుండా బ్రాహ్మణులు భారతీయ ప్రజల ఖర్చుతో లాభార్జన పొందుతున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో పీటర్ నవారో వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాపై పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పుదోవ పట్టించేవని అన్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు కేంద్ర ప్రభుత్వానికి చాలా ముఖ్యమన్నారు. రెండు దేశాలు సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని పేర్కొన్నారు.
►ALSO READ | బ్రిటన్ ఉప ప్రధాన మంత్రి పదవికి ఏంజెలా రేనర్ రాజీనామా
ఇండియా, అమెరికా దేశాలు కట్టుబడి ఉన్న ఎజెండాపై మేము దృష్టి సారించామని.. ఉమ్మడి ఆసక్తుల ఆధారంగా ఇరుదేశాల సంబంధం ముందుకు సాగుతుందని ఆశిస్తున్నామన్నారు. షాంఘై సహకార సంస్థ (SCO)లో తమకు పూర్తి స్థాయి సభ్యత్వం రాకుండా భారత్ అడ్డుకుందని అజర్‌బైజాన్ చేసిన ఆరోపణలను జైశ్వాల్ తోసిపుచ్చారు.
SCO విస్తరణ కొనసాగుతున్న ప్రక్రియ అని.. అర్మేనియా, అజర్‌బైజాన్ ఈ సంవత్సరం సభ్యత్వ దరఖాస్తులను సమర్పించాయని గుర్తు చేశారు. సమయం లేకపోవడంతో టియాంజిన్‌లో జరిగిన ఎస్సీవో మీటింగ్లో సభ్య దేశాలు ఈ అంశంపై నిర్ణయం తీసుకోలేకపోయాయని వివరణ ఇచ్చారు. అర్మేనియా, అజర్బైజాన్కు సభ్యత్వం అంశం ఇప్పటికీ ఎస్ సీవో పరిశీలనలో ఉందని తెలిపారు.