
లండన్: బ్రిటన్ ఉప ప్రధాన మంత్రి పదవికి ఏంజెలా రేనర్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధాని కీర్ స్టార్మర్కు పంపించారు. పన్ను ఎగవేతకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రిజైన్ లెటర్లో ఆమె స్పష్టం చేశారు. డిప్యూటీ పీఎం పదవితో పాటు లేబర్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు.
ఈ ఏడాది వేసవిలో హోవ్ నగరంలో ఏంజెలా రేనర్ ఒక ఇళ్లు కొనుగోలు చేశారు. అయితే.. ఆ ఇళ్లు కొనుగోలుకు సంబంధించి స్టాంప్ డ్యూటీ (ట్యాక్స్) చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆమెపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపడంతో ప్రభుత్వం లారీ మాగ్నస్ నేతృత్వంలో స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై విచారణ జరిపిన లారీ మాగ్నస్.. ఏంజెలా రేనర్ సరైన పన్ను చెల్లింపులో విఫలమయ్యారని తేల్చారు. ఈ క్రమంలో ఏంజెలా రేనర్ తన తప్పును అంగీకరించి.. పన్ను ఎగవేతకు బాధ్యత వహిస్తూ బ్రిటన్ ఉప ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఏంజెలా రేనర్ పట్ల ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా సేవ పట్ల ఆమె అంకితభావాన్ని ప్రశంసించారు. రేనర్పై అభిమానం, రాజకీయాల్లో ఆమె సాధించిన విజయాల పట్ల అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. ఏంజెలా రేనర్ ఉప ప్రధాని పదవితో పాటు లేబర్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో అధికార పార్టీలో నాయకత్వ శూన్యత ఏర్పడింది. లేబర్ పార్టీ భవిష్యత్ నాయకురాలిగా ఏంజెలా రేనర్ను పరిగణిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఆమె పన్ను ఎగవేత ఇష్యూలో చిక్కుకుని రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.