ఒలింపిక్స్‌ బెర్తులపై ఇండియా హాకీ జట్ల గురి

ఒలింపిక్స్‌ బెర్తులపై ఇండియా హాకీ జట్ల గురి
  • నేడు, రేపు క్వాలిఫయర్స్  ఫైనల్‌ రౌండ్‌
  • రష్యాతో పురుషుల టీమ్‌ ఢీ
  • అమెరికాతో అమ్మాయిలకు సవాల్‌

భువనేశ్వర్‌‌: టోక్యో ఒలింపిక్స్‌‌కు క్వాలిఫై కావడమే టార్గెట్‌‌గా ఇండియా పురుషుల, మహిళల హాకీ జట్లు సొంతగడ్డపై జరిగే క్వాలిఫయర్స్‌‌ చివరి రౌండ్‌‌ పోరుకు రెడీ అయ్యాయి. రెండు అడుగుల దూరంలో ఒలింపిక్‌‌ బెర్తులు కనిపిస్తుండగా.. ఇక్కడి కళింగ స్టేడియంలో శుక్ర, శనివారాల్లో జరిగే రెండేసి మ్యాచ్‌‌ల్లో రష్యాతో అబ్బాయిలు, అమెరికాతో అమ్మాయిలు పోటీ పడనున్నారు. ఈ మ్యాచ్‌‌ల్లో గెలిచిన జట్లు ఒలింపిక్స్‌‌కు క్వాలిఫై అవుతాయి. ఐదో ర్యాంక్‌‌లో ఉన్న మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ కెప్టెన్సీలోని పురుషుల టీమ్‌‌.. ప్రపంచ 22వ ర్యాంకర్‌‌ రష్యాతో పోరులో ఫేవరెట్‌‌గా బరిలోకి దిగనుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న మన జట్టుకు రష్యన్లపై విజయం నల్లేరుపై నడకే అనిపిస్తోంది. అయితే, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే.. ఒలింపిక్స్‌‌ చాన్స్‌‌ కోల్పోయే ప్రమాదం ఉందని ఆటగాళ్లను కోచ్‌‌ గ్రహమ్‌‌ రీడ్‌‌ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన్‌‌ప్రీత్‌‌సేన ఈ రెండు రోజుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆడాల్సి ఉంటుంది. రీడ్‌‌ కోచింగ్‌‌లో ఏడాది కాలంలో ఇండియా డిఫెన్స్ ఎంతో మెరుగైంది. సురేందర్‌‌ కుమార్‌‌, జూనియర్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ గెలిచిన ఇండియా సభ్యుడు హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ ప్రత్యర్థి దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నారు. సీనియర్‌‌ డ్రాగ్‌‌ఫ్లికర్స్‌‌ రుపిందర్‌‌ పాల్‌‌ సింగ్‌‌, బీరేంద్ర లక్రా రాకతో బ్యాక్‌‌లైన్‌‌ బలం మరింత పెరిగింది. కెప్టెన్‌‌ మన్‌‌ప్రీత్‌‌ నేతృత్వంలోని మిడ్‌‌ఫీల్డ్‌‌ పదునుగా ఉంది. మన్‌‌దీప్‌‌, ఆకాశ్‌‌దీప్‌‌, ఎస్‌‌వీ సునీల్‌‌, రమణ్‌‌దీప్‌‌ ఏ క్షణంలో అయినా గోల్‌‌ కొట్టగల సమర్థులు. గోల్‌‌ కీపర్‌‌ శ్రీజేష్‌‌ సత్తా గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

రాణి బృందం రాణిస్తుందా?

అబ్బాయిల విజయంపై అనుమానాలు లేకున్నా.. రాణి రాంపాల్‌‌ కెప్టెన్సీలోని ఇండియా మహిళల టీమ్‌‌.. పటిష్ఠ యూఎస్‌‌ఏను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.  ప్రపంచ 13 ర్యాంకర్‌‌ అమెరికాను ఓడించడం అంత ఈజీ కాదు. ఆ జట్టుతో హెడ్‌‌ టు హెడ్‌‌లో ఇండియా నాలుగుసార్లు గెలిచి, 22 సార్లు పరాజయం పాలైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ మధ్యకాలంలో ఇండియా జట్టు ఎంతో మెరుగైంది.  కెప్టెన్‌‌ రాణితో పాటు డ్రాగ్‌‌ఫ్లికర్‌‌ గుర్జిత్‌‌ కౌర్‌‌, యంగ్‌‌ ఫార్వర్డ్‌‌ లాల్‌‌రెమ్‌‌సియామి, గోల్‌‌కీపర్‌‌ సవిత జట్టును ముందుండి నడిపిస్తున్నారు.  అయితే, తొలిసారి హోమ్‌‌గ్రౌండ్‌‌లో ఆడుతున్న అమ్మాయిలకు.. ప్రత్యర్థిని ఎదుర్కోవడం కంటే కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చే అభిమానులను అంచనాల ఒత్తిడిని ఎదుర్కోవడం మరింత సవాల్‌‌ కానుంది. అయితే, ఈ మ్యాచ్‌‌ కోసం తాము అన్ని రకాలుగా  ప్రిపేరయ్యామని కెప్టెన్‌‌ రాణి తెలిపింది.