
అహ్మదాబాద్: మనదేశం క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో వేగంగా ఎదుగుతోందని, వీటిలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని హన్సల్పూర్మారుతి సుజుకీ హైబ్రిడ్బ్యాటరీ ప్రొడక్షన్యూనిట్ను, ఎలక్ట్రిక్విటారా కారు ఎగుమతులను మంగళవారం ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. దేశంలో నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తి ఉందని, ఇది పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు.
మారుతి సుజుకి వంటి సంస్థలు భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్లు అని కొనియాడారు. ఇప్పుడు విదేశాలకు వెళ్లే ఈవీల మీద ‘మేడ్ ఇన్ ఇండియా’ అని ఉంటుందని మోదీ అన్నారు. భారత్ ఇంతకాలం ఈవీ బ్యాటరీల కోసం దిగుమతులపై ఆధారపడిందని, ఇప్పుడు పరిస్థితి మారుతోందని చెప్పారు. ఈ బ్యాటరీలను భారతదేశంలోనే తయారు చేయడం చాలా ముఖ్యమని అన్నారు. ఈ మిషన్‌కు తోషిబా, డెన్సో, సుజుకి కంపెనీలు ముందుకు వచ్చాయని ప్రధాని చెప్పారు. ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు గొప్ప మద్దతు అని అన్నారు.
‘‘భారతదేశ ఆర్థిక సంస్కరణల ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ గత దశాబ్దంలో 500 శాతం పెరిగింది. రాబోయే కాలంలో సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. భారతదేశం–-జపాన్ సంబంధాలు కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాదు. చరిత్ర, సంస్కృతికి కూడా సంబంధించినవి. ఈ ప్రయాణం మారుతి సుజుకితో ప్రారంభమై ఇప్పుడు బుల్లెట్ ట్రెయిన్ వేగంతో సాగుతోంది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జపాన్‌తో సంబంధాలు బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాను”అని ఆయన అన్నారు.
భారత్‌లో సుజుకీ రూ.70 వేల కోట్ల పెట్టుబడులు
రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో భారతదేశంలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకోవడం కోసం రూ. 70 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని సుజుకీ ఎండీ, సీఈఓ తోషిహిరో సుజుకీ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ-–విటారా సుమారు 100 దేశాలకు ఎగుమతి అవుతుందని వెల్లడించారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం- అయాన్ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తిని కూడా ప్రారంభించామని చెప్పారు.
మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ విలేకరులతో మాట్లాడుతూ, కంపెనీ లక్ష్యం ఏటా 40 లక్షల యూనిట్ల ఉత్పత్తి అని, కొత్త టెక్నాలజీలు, ఆర్ అండ్ డీ కోసం కూడా భారీ పెట్టుబడులు ఉంటాయని వివరించారు. గుజరాత్లో రూ. 35 వేల కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంట్ ఏర్పాటుపై జీఎస్టీ మండలి సమావేశం తర్వాత స్పష్టత వస్తుందని అన్నారు. సుజుకీ గ్రూప్ ఇప్పటికే భారతదేశంలో రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టిందని, దీని వల్ల 11 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని భార్గవ తెలిపారు.