పద్మభూషణ్ అందుకున్న సుందర్ పిచాయ్

పద్మభూషణ్ అందుకున్న సుందర్ పిచాయ్
  • ఇండియా.. నాలోనే!.. ఎప్పుడూ నాతోనే ఉంటది: సుందర్ పిచాయ్
  • ఇండియా రాయబారి నుంచి పద్మభూషణ్ అందుకున్న గూగుల్ కంపెనీ సీఈవో
  • అవార్డుతో గౌరవించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞుడినని కామెంట్

వాషింగ్టన్: ఇండియా.. తనలో ఒక భాగమని, తాను ఎక్కడికెళ్లినా తనతోనే తీసుకెళతానని గూగుల్ సీఈవో, ఇండియన్ అమెరికన్ సుందర్ పిచాయ్ అన్నారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అమెరికాలో ఇండియా రాయబారి తరణ్​జిత్ సింగ్ సంధు నుంచి ఆయన అందుకున్నారు. శుక్రవారం (అక్కడి టైం ప్రకారం) శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో పిచాయ్​ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ‘‘అవార్డుతో గౌరవించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు నేను కృతజ్ఞుడిని. నన్ను తీర్చిదిద్దిన దేశమే నన్నిలా గౌరవించడం సంతోషంగా ఉంది. ఇండియా నాలో భాగం. నేను ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళతా (ఈ అందమైన అవార్డును మాత్రం నేను ఎక్కడో ఒకచోట భద్రంగా ఉంచుతాను)” అని అన్నారు. ‘‘నా తల్లిదండ్రులు నాకోసం ఎంతో త్యాగం చేశారు. చదువును ఎంతో ఇష్టపడే కుటుంబంలో పెరగడం నా అదృష్టం” అని చెప్పారు.

మరిన్ని అవకాశాలు ముందున్నయ్

గూగుల్ ఆఫీస్‌ను అమెరికాలో ఇండియా రాయబారి తరణ్​జిత్ సింగ్ సంధు సందర్శించారు. అక్కడి ఉద్యోగులతో ఇంటరాక్ట్  అయ్యారు. ఈ సందర్భంగా పిచాయ్ మాట్లాడారు. మరిన్ని అవకాశాలు ముందున్నాయని చెప్పారు. జీ20 ప్రెసిడెన్సీని ఇండియా చేపట్టడం సంతోషకరమని పిచాయ్​ పేర్కొన్నారు.

ఇండియాలో వేగంగా మార్పులు

ఇండియాలో వేగంగా సాంకేతిక మార్పులు జరుగుతున్నాయని, వాటిని చూడటానికి ఇండియాకు తిరిగి రావడం చాలా అద్భుతంగా ఉంటుందని పిచాయ్ అన్నారు. డిజిటల్ పేమెంట్స్ నుంచి వాయిస్ టెక్నాలజీ దాకా ఇండియాలో రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలు.. ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇండియా, గూగుల్ మధ్య గొప్ప భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. టెక్నాలజీ ప్రయోజనాలను మరింత మంది ప్రజలకు అందించేందుకు తాము కలిసి పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘ప్రధాని మోడీ ‘డిజిటల్ ఇండియా’ విజన్.. దేశ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. ప్రభుత్వాలు, వ్యాపారాలు, కమ్యూనిటీల భాగస్వామ్యంతో ఇండియాలో గూగుల్ పెట్టుబడులు కొనసాగిస్తుండటాన్ని గర్వంగా భావిస్తున్నా’’ అని వివరించారు. 2022 ఏడాదికిగానూ ట్రేడ్, ఇండస్ట్రీ కేటగిరీలో సుందర్ ​పిచాయ్‌ను పద్మభూషణ్ వరించింది.