
- తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి
ముషీరాబాద్, వెలుగు: అన్ని రంగాల్లో ఇండియా డెవలప్ అవుతోందని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి అన్నారు. బ్రిటీష్ పాలకుల చేతుల్లో నుంచి విముక్తి పొందిన తర్వాత కూడా పేదరికం, నిరక్షరాస్యతతో దేశం చాలాకాలం పోరాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇండియా పేదరికం నుంచి బయటపడి అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహోత్సవానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, ఆర్‌ఎన్ రవి హాజరయ్యారు.
ప్రధాని చేపట్టే కార్యక్రమాలు, తీసుకొచ్చే పథకాలతో 100వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకునే సమయానికి ప్రపంచంలో మన దేశం నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఆర్‌ఎన్ రవి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ గిరిజన కళలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రపంచానికి పరిచయం చేశారని పొగిడారు. సంస్కృతి మహోత్సవాల రెండోరోజు నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, హీరో చిరంజీవి తదితరులు హాజరయ్యారు. కాగా, జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. శనివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఎన్టీఆర్ స్టేడియానికి తరలివచ్చారు.