టీకాలు ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వేయడంలో మనమే ఫస్ట్

టీకాలు ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వేయడంలో మనమే ఫస్ట్
  • దేశవ్యాప్తంగా 13 కోట్ల డోసుల కరోనా టీకాల పంపిణీ పూర్తి  
  • 24 గంటల్లో 29.90 లక్షల మందికి వ్యాక్సిన్  
  • 95 రోజుల్లో 13 కోట్ల డోసులు వేసిన దేశంగా ఇండియా 
  • కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడి 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం 7 గంటల వరకు 13 కోట్లకు పైగా డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసినట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 29,90,197 డోసుల టీకాలను వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు మొత్తం13,01,19,310 డోసుల వ్యాక్సినేషన్ ను పూర్తి అయిందని, కరోనా వ్యాక్సినేషన్ లో 95 రోజుల్లోనే (బుధవారం నాటికి) 13 కోట్ల మార్కును దాటిన మొదటి దేశంగా ఇండియా నిలిచిందని కేంద్రం ప్రకటించింది. అమెరికా101 రోజుల్లో, చైనా 109 రోజుల్లో 13 కోట్ల డోసుల మార్కును దాటాయని పేర్కొంది. మొత్తం వ్యాక్సిన్​లలో 59.33శాతం డోసులు మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బెంగాల్, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోని వారికి వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

95 రోజుల్లో వ్యాక్సినేషన్ ఇలా.. 
మనదేశంలో జనవరి16న హెల్త్ కేర్ వర్కర్లకు టీకాలతో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు ఇచ్చారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడినవారికి, 45 ఏళ్లు దాటి కోమార్బిడిటీ కండిషన్ ఉన్నవారికి వ్యాక్సిన్ లు ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను ఇస్తున్నారు. తాజాగా, మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం సోమవారమే నిర్ణయించింది.  

కొవిషీల్డ్ ధర.. రాష్ట్రాలకు 400.. ప్రైవేట్ దవాఖాన్లకు 600
కొవిషీల్డ్ కరోనా టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400కు , ప్రైవేట్ దవాఖాన్లకు రూ. 600 చొప్పున ఒక డోస్ ను అమ్మనున్నట్లు పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ఇండియా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి యథావిధిగా రూ. 150కి ఒక డోస్ ను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఫారిన్ వ్యాక్సిన్ ల ధరలు ఒక డోసుకు రూ. 750 నుంచి రూ. 1,500 వరకూ ఉన్నాయని, వాటితో పోలిస్తే కొవిషీల్డ్ ను తక్కువ ధరకే ఇస్తున్నామని తెలిపింది. అయితే కేంద్రానికి పాత ధరకు టీకాలు ఇస్తుండటంతో, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటళ్లు, సంస్థలకు ఇకపైనా తక్కువ ధరకే టీకా అందనుంది. ఇక కొత్త పాలసీ ప్రకారం కేంద్రానికి 50 శాతం వ్యాక్సిన్ డోసులను, మిగతా 50 శాతం వ్యాక్సిన్ లను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ హాస్పిటళ్లకు డివైడ్ చేసి అమ్మాల్సి ఉంటుంది. అయితే కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులకు సెపరేట్ గా టీకాలు సప్లై చేయడం సాధ్యం కాదని, అందుకే ప్రభుత్వాలు, ప్రైవేట్ హాస్పిటళ్ల నుంచి కొనుక్కోవాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ సూచించింది. మే చివరినాటికి మార్కెట్లోకి కొవిషీల్డ్ టీకాలు మరో 20 శాతం అందుబాటులోకి వస్తాయని ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. జులై తర్వాత  నెలకు10 కోట్ల డోసులను సప్లై చేయనున్నట్లు  తెలిపారు.

18 ఏండ్లు దాటినోళ్లందరికీ ఫ్రీ వ్యాక్సిన్.. మధ్యప్రదేశ్ సర్కార్

భోపాల్: రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన వాళ్లకు కరోనా వ్యాక్సిన్​ ఉచితంగా అందిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తామని ఇప్పటికే అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ప్రకటించగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ జాబితాలో చేరింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవాళ్లకు మే ఫస్టు నుంచి ఉచితంగా టీకాలు వేస్తా మని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చత్తీస్​గఢ్ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. టీకా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం భూపేశ్ బాఘెల్ చెప్పారు.