
రేపటి నుంచి ఇండియా, కివీస్ టెస్ట్ సిరీస్
ఫస్ట్ టెస్టుకు ఇషాంత్ శర్మ, పృథ్వీ షాకు బెర్త్ కన్ఫామ్ !
ఫైనల్ ఎలెవన్‌పై హింట్ ఇచ్చిన విరాట్
ఉదయం 4 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
వెల్లింగ్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనలే లక్ష్యంగా టీమిండియా కఠిన పరీక్షకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ రూపంలో అతి పెద్ద సవాల్ ఎదుర్కోబోతుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లాడిన ఇండియా అన్నింటిలో గెలిచింది. ఇందులో రెండు మ్యాచ్‌లు విండీస్‌లో ఆడితే మిగిలినవన్నీ సొంతగడ్డపై జరిగినవే. అయితే ఇప్పుడు రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ను వారి గడ్డపై ఢీకొంటుంది. ఈ టూర్‌లో ఇండియా టీ20 సిరీస్ గెలిస్తే, కివీస్ వన్డే సిరీస్ దక్కించుకుంది. కానీ టెస్ట్ సిరీస్ మాత్రం ఇండియా సత్తాకు సిసలైన పరీక్షగా నిలవనుంది. ఎందుకంటే రెడ్‌బాల్ క్రికెట్ విషయంలో మిగిలిన దేశాలతో పోలిస్తే కివీస్ పరిస్థితులు చాలా ప్రత్యేకం. 2014లో బేసిన్ రిజర్వ్ స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచే ఇందుకు నిదర్శనం. ఆ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 192కు ఆలౌట్ చేసిన ఇండియా 438 స్కోర్ చేసి 246 రన్స్ లీడ్ దక్కించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ కివీస్‌ను 94/5పై ఉంచి పట్టు బిగించింది. కానీ బ్రెండన్ మెకల్లమ్, వాట్లింగ్ ఆరో వికెట్‌కు 352 రన్స్ జోడించడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 435 రన్స్ టార్గెట్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా 166/3 వద్ద ఉన్నప్పుడు మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇదొక్కటే కాదు శ్రీలంక, బంగ్లాదేశ్‌తో న్యూజిలాండ్ ఇటీవల ఇక్కడ ఆడిన టెస్ట్‌లు కూడా ఇలానే ముగిశాయి. తొలి రెండ్రోజులు సంగతి ఎలా ఉన్న… మ్యాచ్ సాగే కొద్దీ వికెట్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిపోతుంది. కివీస్‌లో వికెట్లన్నీ దాదాపు ఇలానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఇదే బేసిన్ రిజర్వ్‌లో ఇండియా, కివీస్ మధ్య శుక్రవారం ఫస్ట్ టెస్ట్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా సత్తాకు ఈ సిరీస్ అసలు సిసలు ‘టెస్ట్’ కానుంది.
ఇషాంత్ రెడీ !
న్యూజిలాండ్‌తో ఫస్ట్ టెస్ట్ కోసం టీమిండియా బుధవారం ఫుల్‌గా ప్రాక్టీస్ చేసింది. గాయం నుంచి కోలుకొని ఇటీవలే కివీస్ వచ్చిన ఇషాంత్ దాదాపు గంటన్నర సేపు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. దీంతో లంబూ ఫైనల్ ఎలెవన్‌లో ఉండటం దాదాపు ఖాయం. ప్రాక్టీస్ సెషన్‌లో మునపటి ఇషాంత్ కనిపించాడని మీడియా సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అన్నాడు. ఈ సందర్భంగా ఫైనల్ ఎలెవన్‌పై కూడా కొన్ని హింట్స్ ఇచ్చాడు. దీని ప్రకారం పృథ్వీ, మయాంక్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయనుండగా స్పిన్నర్ కోటాలో అశ్విన్ తుది జట్టులో ఉండనున్నాడు. కీపింగ్ బాధ్యతలు సాహాకే దక్కనున్నాయి. ‘ ప్రాక్టీస్ సెషన్‌లో మునుపటి ఇషాంత్ కనిపించాడు. మంచి ఏరియాల్లో బాల్స్ వేస్తున్నాడు. పైగా లంబూకు కివీస్‌లో ఆడిన అనుభవం ఉంది. పృథ్వీ చాలా టాలెంటెడ్ క్రికెటర్. అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదు. పృథ్వీ తన స్టయిల్‌లో ఆడాలని కోరుకుంటున్నాం. విదేశీగడ్డపై ఆడుతున్నామనే భయం మయాంక్, పృథ్వీ ఇద్దరిలోనూ లేదు. బౌలింగ్ విషయానికొస్తే ముగ్గురు పేసర్లతో ప్రత్యర్థిని ఆలౌట్ చేసే సత్తా మాకుంది. అయితే మాకో వరల్డ్ క్లాస్ స్పిన్నర్ కూడా కావాలి. ప్రత్యర్థిలా నలుగురు పేసర్ల వ్యూహాన్ని అమలు చేయాలని అనుకోవడం లేదు. గత కివీస్ టూర్‌తో పోలిస్తే ప్రస్తుతం మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది’ అని కోహ్లీ అన్నాడు.
టెస్ట్ చాంపియన్‌షిప్ తర్వాతే ఏదైనా..
2023–31 మధ్య నిర్వహించే ఈవెంట్స్‌కు సంబంధించి బ్రాడ్‌కాస్టర్ల ముందు ఐసీసీ ఓ ప్రతిపాదన ఉంచింది. దీని ప్రకారం వైట్‌బాల్ క్రికెట్‌కే బోర్డు ప్రాధాన్యమిచ్చింది. ఈ అంశంపై కోహ్లీ మాట్లాడుతూ.. ‘నన్నడిగితే ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ తర్వాతే ఏ టోర్నీ అయినా. నాకు తెలిసి లార్డ్స్‌లో జరిగే ఫైనల్ ఆడాలని ప్రతీ టీమ్ లక్ష్యంగా పెట్టుకుంటుంది. మా లక్ష్యం కూడా అదే. వీలైనంత త్వరగా ఫైనల్‌కు అర్హత సాధించాలని అనుకుంటున్నా. ఆ తర్వాత చాంపియన్‌షిప్ గెలవడంపై దృష్టి పెడతాం’ అని చెప్పాడు.
మరో మూడేళ్లు అన్నీ ఆడేస్తా..
కొన్నేళ్లుగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మూడేళ్లు అన్ని ఫార్మాట్లు ఆడతానని చెప్పాడు. ఆ తర్వాతే కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. వర్క్ లోడ్ తగ్గించుకునేందుకు విడతల వారీగా బ్రేక్స్ తీసుకుంటానని తెలిపాడు. ‘ మరో మూడేళ్లు తీవ్రంగా శ్రమించాలని నా మైండ్‌సెట్ మార్చుకున్నా. ట్రావెలింగ్, ట్రైనింగ్‌తో కలిపి గత ఎనిమిదేళ్లుగా ఏడాదిలో 300 రోజులు క్రికెట్ ఆడుతున్నా. ఆసక్తి ఉన్నంత కాలం ఇది భారం అనిపించదు. కానీ 35 ఏళ్లు వచ్చే సరికి శరీరం ఇప్పటిలా సహకరించదు. ఓ షెడ్యూల్ పెట్టుకుని బ్రేక్ తీసుకోవడం కంటే విడతల వారీగా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతా. మరో మూడేళ్ల పాటు జట్టు నా నుంచి కోరుకున్నది ఇవ్వగలను. ఆ తర్వాత పరిస్థితి ప్రకారం ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు’ అని చెప్పుకొచ్చాడు.
పొలానికి ట్యాంకర్ నీళ్లు : అన్నదాతకు అడుగడుగునా కష్టాలే
షెడ్యూల్ ఇదే: అమ్మాయిల టీ20 వరల్డ్ కప్