హిందీపై రగడ.. కేంద్రం బలవంతంగా రుద్దుతోందంటూ దక్షిణాది రాష్ట్రాల్లో నిరసనలు

హిందీపై రగడ.. కేంద్రం బలవంతంగా రుద్దుతోందంటూ దక్షిణాది రాష్ట్రాల్లో నిరసనలు
  • ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, కేరళ వ్యతిరేక గళం
  • తాజాగా మహారాష్ట్రలోనూ మరాఠా వాదం తెరపైకి 
  • మరోసారి దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న భాషా వివాదం

సెంట్రల్ డెస్క్, వెలుగు: దేశంలో హిందీ వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా హిందీ భాషను రుద్దాలని చూస్తోందంటూ దక్షిణాది రాష్ట్రాలు ఒక్కొక్కటి వరుసగా నిరసన గళం వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు హిందీని వ్యతిరేకించగా.. తాజాగా ఈ సౌత్ స్టేట్స్ కు తోడుగా మహారాష్ట్రలో కూడా అదే తరహా నిరసనలు మొదలయ్యాయి. హిందీ భాష కారణంగా నార్త్ లో ఇప్పటికే 25 చిన్న చిన్న భాషలు కనుమరుగైపోయాయని, ఆ భాషను బలవంతంగా రుద్దితే తమ రాష్ట్రాల్లోనూ భాష, సంస్కృతి నాశనమవుతాయని దక్షిణాదిలోని ఆయా రాష్ట్రాల ప్రజలు, పార్టీల నేతలు అంటున్నారు.

తాజాగా మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడని వ్యాపారులపై దాడులు సైతం జరగడంతో దేశంలో హిందీ భాషా వివాదం మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.  దేశవ్యాప్తంగా దాదాపు 1,600 భాషలు, మాండలికాలు ఉన్నాయి. దేశ సాంస్కృతిక వైవిధ్యానికి ఇవి ప్రతీకలుగా నిలిచినా.. తరచూ ఆయా రాష్ట్రాల మధ్య భాషలే వివాదాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఎక్కువగా మాట్లాడే హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో  కూడా సౌత్ స్టేట్స్ తరహాలోనే నిరసనలు మొదలవడంతో వివాదం మరింత ముదిరినట్లయింది.
  
కేరళలోనూ నిరసనలు..
హిందీకి వ్యతిరేకంగా మరో దక్షిణాది రాష్ట్రం కేరళలోనూ నిరసనలు జరిగాయి. రాష్ట్ర విద్యా విధానం, పరిపాలనలో మలయాళీ భాషకే ప్రాధాన్యం ఇస్తున్న ఇక్కడి ప్రభుత్వం ఎన్ఈపీలోని త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తోంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పేర్కొన్న 22 భాషలను సమానంగా చూడాలంటూ సీఎం పినరయి విజయన్ ఇటీవల డిమాండ్ చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో హిందీ వినియోగంపై మాత్రం ఇక్కడ నిరసనలు అంతంత మాత్రంగానే జరిగాయి. కానీ స్కూళ్లలో తాము మలయాళం, ఇంగ్లిష్ మాత్రమే అమలు చేస్తామని, హిందీని థర్డ్ లాంగ్వేజ్ గా రిజెక్ట్ చేస్తున్నామని ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర విద్యా శాఖ ప్రకటించింది.

ఎందుకీ వివాదం?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) 2020లో పేర్కొన్న త్రిభాషా విధానం ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లోని స్కూళ్లలో ప్రాంతీయ భాషలో విద్యా బోధన జరగాలి. అలాగే మరో భారతీయ భాషతోపాటు అంతర్జాతీయ భాష (ఇంగ్లిష్)ను సబ్జెక్టులుగా బోధించాలి. అయితే, ఈ విధానం సౌత్ స్టేట్స్ పై హిందీని బలవంతంగా రుద్దేలా ఉందంటూ తమిళనాడు, కర్నాటక, కేరళ ఆరోపిస్తున్నాయి. తాజాగా  మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవడంతో ఇక్కడా దుమారం రేగింది. దీంతో ఈ నిర్ణయంపై రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గింది. అయితే, దేశంలో త్రిభాషా విధానం మొదటిసారిగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)1968 ద్వారా అమలులోకి వచ్చింది. ‘‘హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని బడుల్లో హిందీ, ఇంగ్లిష్ తోపాటు దక్షిణాది నుంచి లేదా ఇతర ప్రాంతాల భాషల నుంచి ఏదో ఒక భాషను థర్డ్ లాంగ్వేజ్ గా బోధించాలి. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లోని బడుల్లో స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, హిందీని బోధించాలి” అని ఎన్ఈపీ 1968లో పేర్కొన్నారు.

దీంతో హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో అప్పుడే ఉద్యమం మొదలైంది. ఈ పాలసీని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ప్రధానంగా హిందీ ఇండో ఆర్యన్ భాష అని, దీని వల్ల ద్రవిడ భాషలు (తమిళం, కన్నడ, తెలుగు వంటివి) ఉనికిని కోల్పోతాయని పెరియార్ రామస్వామి, డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై వంటి నాయకులు, మేధావులు వ్యతిరేకించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు హిందీని బలవంతంగా రుద్దడం ద్వారా తమిళ సంస్కృతిని నాశనం చేసి, ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. అలాగే హిందీని ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్య ధోరణికి చిహ్నంగా చూస్తుండటంతో మిగతా దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఇప్పుడు మహారాష్ట్రలోనూ వివాదం రాజుకుంది.

కర్నాటకలో కన్నడ ప్రైడ్ ఉద్యమం..
హిందీకి వ్యతిరేకంగా కర్నాటకలోనూ ఇటీవల కన్నడ ప్రైడ్ పేరుతో ఉద్యమం మొదలైంది. కర్నాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ప్రధానంగా బెంగళూరులోని మెట్రో స్టేషన్లు, బ్యాంకులు, రైల్వే స్టేషన్లలో హిందీ సైన్ బోర్డులను కన్నడ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. గత ఫిబ్రవరిలో భాషా వివాదం కారణంగా చిత్రదుర్గలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్ డ్రైవర్ పై కన్నడిగులు దాడి చేయడం సంచలనంగా మారింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా బస్ సర్వీసులు సైతం నిలిచిపోయాయి. ఆ తర్వాత ‘చలో బెళగావి’ పేరుతో కన్నడ ప్రైడ్ ఉద్యమకారులు భారీ ర్యాలీ సైతం నిర్వహించారు. 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ఈపీ, హిందీ విధానాలు కన్నడకు వ్యతిరేకంగా ఉన్నాయని రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సైతం విమర్శించారు. ఈ ఏడాది టెన్త్ లో హిందీ సబ్జెక్టులో 1.2 లక్షల మంది స్టూడెంట్లు ఫెయిల్ కావడంతో కరికులం నుంచి హిందీని తీసెయ్యాలని, తమిళనాడు తరహాలో ద్వి భాషా విధానాన్నే అనుసరించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇంతకుముందు 2022లో నాన్ కన్నడ భాషల్లో ఉన్న సైన్ బోర్డులపై ఉద్యమకారులు దాడులు చేయడంతో వ్యాపార సంస్థల సైన్ బోర్డుల్లో 60% వరకూ కన్నడ పదాలను వాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లును కూడా పాస్ చేసింది. 

తమిళనాడులో 1930ల నుంచే వ్యతిరేకత..
దేశంలో హిందీ భాషకు వ్యతిరేకంగా మొట్టమొదట గళం వినిపించిన రాష్ట్రం తమిళనాడు. ఇక్కడి ప్రజలు, నాయకులు స్వాతంత్ర్యానికి ముందు నుంచే అంటే..1930ల నుంచే హిందీని వ్యతిరేకిస్తున్నారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక తెచ్చిన త్రిభాషా విధానాన్ని సైతం తిరస్కరించారు. తమిళనాడులో హిందీ బోధన ప్రారంభిస్తే తమిళుల గుర్తింపే ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. హిందీని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫెడరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తమిళనాడు(ఎఫ్ఎస్ఓటీఎన్), డీఎంకే ఆధ్వర్యంలో మదురై, దిండిగల్, థేని, రామనాథపురం, శివగంగ తదితర ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు.

మేలూరు పోస్ట్ ఆఫీస్, ఇతర ప్రాంతాల్లోని ఆఫీసులకు హిందీలో ఉన్న నేమ్ బోర్డులపై నలుపు రంగు పూశారు. గత మార్చిలో సీఎం ఎంకే స్టాలిన్ సైతం కేంద్రంపై మండిపడ్డారు. హిందీని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామన్నారు. ఏప్రిల్ లోనూ హిందీ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తడంతో స్టాలిన్ స్పందిస్తూ.. హిందీ భాష హర్యాన్వీ, రాజస్థానీ, బిహారీ వంటి భాషలను మింగేస్తోందన్నారు. హిందీ వివాదం ఒక తేనెతుట్టెలాంటిదని, దీనిని కదిలించొద్దంటూ కేంద్రాన్ని హెచ్చరించారు.

మహారాష్ట్రలోనూ రాజుకున్న వివాదం..
మహారాష్ట్రలో అత్యధిక మంది మరాఠీ మాట్లాడుతున్నప్పటికీ, హిందీ మాట్లాడేవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందుకే మహారాష్ట్రను హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఒకటిగా కూడా భావిస్తారు. అయితే, ప్రైమరీ స్కూళ్లలో హిందీని థర్డ్ లాంగ్వేజ్ గా తప్పనిసరి చేస్తూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో వివాదం మొదలైంది. అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన (షిండే) పార్టీల నాయకులు సైలెంట్ గా ఉండిపోగా.. ప్రతిపక్షంలో ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్), శివసేన (యూబీటీ) మాత్రం హిందీని వ్యతిరేకిస్తూ మరాఠా వాదాన్ని తెరపైకి తెచ్చాయి.

ముంబైలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీంతో సీఎం ఫడ్నవీస్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కూడా హిందీకి వ్యతిరేకంగా దుమారం కొనసాగింది. పుణేలో మరాఠీ మాట్లాడనన్న వ్యాపారిపై ఎంఎన్ఎస్ కార్యకర్తల దాడి సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో మరాఠీ భాష కోసం అంటూ.. 20 ఏండ్లుగా దూరంగా ఉన్న అన్నదమ్ములు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఒకే వేదికపైకి రావడం మరింత సంచలనంగా మారింది. దీంతో వీరిద్దరూ కలిసి రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా మరాఠా వాదాన్ని బలంగా తెరపైకి తెచ్చినట్టయింది.