ఒలింపిక్స్‌కు ముందు ఇండియా అథ్లెటిక్స్ రిలే జట్లకు ఎదురు దెబ్బ తగిలింది. వచ్చే నెలలో పోలాండ్ వేదికగా జరిగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్..వరల్డ్ అథ్లెటిక్స్ రిలేస్‌కు ఇండియా టీమ్స్ దూరం కావాల్సి వచ్చింది. కరోనా నేపథ్యంలో ట్రావెల్ బ్యాన్‌లో భాగంగా ఆమ్‌స్టర్‌డామ్ వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ రద్దు కావడమే ఇందుకు కారణం. మే 1,2వ తేదీల్లో జరిగే ఈ టోర్నీ కోసం స్టార్ అథ్లెట్స్ హిమ దాస్, ద్యుతీ చంద్ మహిళల 4x100 మీ. రిలే టీమ్, 4x400 పురుషుల టీమ్ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలో ఆమ్‌స్టర్‌డామ్ వెళ్లే విమానం ఎక్కాల్సి ఉంది. కానీ, ఇండియా నుంచి వచ్చే విమానాలను డచ్ ప్రభుత్వం సోమవారం సాయంత్రం నుంచే సస్పెండ్ చేసింది. ఇండియా నుంచి పోలాండ్‌కు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో అక్కడికి వెళ్లే మార్గంలో ఏదైనా యూరోపియన్ సిటీకి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ విమానాలను బుక్ చేసేందుకు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో, మరో మార్గం లేక టోర్నీ నుంచి ఇండియా విత్‌డ్రా అవ్వాల్సి వచ్చింది.
