ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత విషయంలో ఇండియా, బంగ్లామధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జమాతే ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమారుడు, బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ భారత్‌పై విషం చిమ్మాడు. ఇండియా ముక్కలు ముక్కలుగా విడిపోతేనే బంగ్లాదేశ్‌లో పూర్తిగా శాంతి ఏర్పడుతుందని.. లేదంటే మన దేశంలో ఎన్నటికీ శాంతి నెలకొనదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘భారతదేశం ముక్కలుగా విడిపోనంత వరకు బంగ్లాదేశ్ పూర్తి శాంతిని చూడదు. న్యూఢిల్లీ బంగ్లాలో ఎల్లప్పుడూ అశాంతిని సజీవంగా ఉంచుతుంది’’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. భారతదేశ సరిహద్దులో ఉన్న ఆగ్నేయ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ డివిజన్‌లోని మూడు కొండ జిల్లాలను కలిగి ఉన్న చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ ప్రాంతంలో 1975 నుంచి 1996 వరకు భారతదేశం అశాంతికి ఆజ్యం పోసిందని నిరాధార ఆరోపణలు చేశారు. 1997లో కుదిరిన చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ శాంతి ఒప్పందం కేవలం ప్రదర్శన కోసమేనని ఆరోపించారు. అమాన్ అజ్మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భారతదేశం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
జమాతే ఇస్లామీ సంస్థ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి తొత్తు. జమాతే ఇస్లామీ ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహిస్తోందనే కారణంతో బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ సంస్థను నిషేధించారు. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాలో మహ్మమద్ యూనస్ నేతృత్వంలో ఏర్పాటైన తాత్కలిక ప్రభుత్వం జమాతే ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తేసింది. దీంతో ఆ సంస్థ మళ్లీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తివేయడం, ఆ సంస్థ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావడం భారత్‌కు తలనొప్పినేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
