
సిడ్నీ: మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్ (73), స్టీవ్ స్మిత్ (81), కామెరాన్ గ్రీన్ (84)తోపాటు టీమ్ పైనే (39 నాటౌట్) రాణించడంతో 312 పరుగుల స్కోరు చేసింది. కేవలం 6 వికెట్లే కోల్పోయిన కంగారూ జట్టు.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని భారత్‌కు 407 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. యంగ్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ (31)తో జట్టు కట్టిన రోహిత్ (52) తొలి వికెట్‌కు 71 రన్స్ జోడించారు. అయితే వీరిద్దరినీ పేసర్ హాజెల్‌వుడ్ స్వల్ప వ్యవధిలో వెనక్కి పంపాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. అయితే పుజారా (9), కెప్టెన్ రహానె (4) మరో వికెట్ పడకుండా 98 రన్స్‌కు రోజును ముగించారు. ఐదో రోజు ఆసీస్ గెలుపునకు 8 వికెట్ల దూరంలో ఉంది. భారత్ గెలవాలంటే మరో 309 రన్స్ చేయాలి. సిడ్నీ వికెట్ పై ఆసీస్ బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కొని ఇన్ని పరుగులు చేయడం కష్టమే. ఒకవేళ డ్రా కావాలన్నా 90 ఓవర్లు క్రీజులో నిలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కించే భారం రహానె-పుజారా పైనే ఉందని చెప్పొచ్చు.