ఇండియా–నేపాల్ బంధం రోటీ–బేటీ లాంటిది: రాజ్ నాథ్ సింగ్

ఇండియా–నేపాల్ బంధం రోటీ–బేటీ లాంటిది: రాజ్ నాథ్ సింగ్
  • దునియాలో ఎవరూ విడదీయలేరని కామెంట్
  • సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటామని స్పష్టం

న్యూఢిల్లీ: నేపాల్ పై ఇండియాకు ఎలాంటి అపార్థాలు లేవని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇండియా– నేపాల్ బంధం రోటీ–బేటీ లాంటిదని.. దునియాలో ఏ శక్తీ విడదీయలేదని కామెంట్ చేశారు. సోమవారం ఉత్తరాఖండ్​లో వర్చువల్ ర్యాలీలో ప్రసంగించిన రాజ్ నాథ్ సింగ్.. రెండు దేశాల మధ్య ఎలాంటి సమస్యలున్నా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. నేపాల్ పట్ల ఇండియన్స్ కు ఎలాంటి చేదు భావాలు లేవన్నారు. లిపులేఖ్ పాస్ వరకు ఇండియా నిర్మించిన హైవే ఇండియా బార్డర్స్ లోనే ఉందని నొక్కి చెప్పిన ఆయన.. ఈ విషయంలో నేపాల్​కు కొంత వ్యతిరేకత ఉందన్నారు. కానీ, తప్పకుండా చర్చల ద్వారా పరిష్కారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

‘‘ ఇండియా నిర్మించిన హైవే.. నేపాల్ ప్రజల్లో ఎదైనా అపార్థానికి కారణమైతే, అది చర్చల ద్వారా క్రమబద్దీకరించబడుతుంది. నేపాల్ తో ఇండియాకు భౌగోళిక, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక సంబంధాలే కాదు.. ఆధ్యాత్మిక బంధం కూడా ఉంది. అలాంటప్పుడు ఇండియా, నేపాల్ మధ్య సంబంధాలు ఎలా విచ్ఛిన్నమవుతాయి!” అని రాజ్ నాథ్ అన్నారు. ఇండియాలో భాగమైన లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలు తమవేనని పేర్కొంటూ రూపొందించిన కొత్త మ్యాప్ ను నేపాల్ పార్లమెంట్ శనివారం ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిని ఇండియా వ్యతిరేకిస్తోంది.