జపాన్ ను దాటేసి టాప్ 3 కి ఇండియా

జపాన్ ను దాటేసి టాప్ 3 కి ఇండియా

అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ(ఐఆర్ఈఎన్ఏ) ప్రకారం భారత్ 1,08,494 గిగావాట్ అవర్(జీడబ్ల్యూహెచ్) సౌరశక్తిని ఉత్పత్తి చేసింది. దీంతో 96,459 జీడబ్ల్యూహెచ్ ఉత్పత్తి చేసిన జపాన్​ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నది. 2015లో ప్రపంచంలో 9వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ వేగవంతమైన వృద్ధి పునరుత్పాదక ఇంధన రంగంలో దేశం చూపిస్తున్న అంకితభావాన్ని సూచిస్తున్నది. 2024, మార్చి నాటికి భారతదేశ సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం 81.81 జీడబ్ల్యూహెచ్. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. 

భారతదేశం సౌరశక్తి రంగంలో ఇంతటి పురోగతి సాధించడానికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు. 

పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు: పారిస్ ఒప్పందంలో భాగంగా భారతదేశం 2030 నాటికి 500 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో సౌరశక్తి కీలక పాత్ర పోషిస్తున్నది. అలాగే, 2070 నాటికి కర్బన తటస్థతను సాధించాలని కూడా దేశం ప్రణాళికలు రచించింది. 

పీఎం సూర్యఘర్ యోజన: ఈ పథకం కింద గృహ వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. దీని ఫలితంగా ప్రతి 45 రోజులకు లక్ష గృహాలకు సౌర ఫలకాలు అమర్చుతారు. 

పీఎం కుసుమ్ యోజన: ఈ పథకం రైతులను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. దీని ద్వారా రైతులు తమ పొలాల వద్ద సౌర పంపులను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా తమ విద్యుత్ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. 

►ALSO READ | కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో మేనేజర్ జాబ్స్.. నెలకు లక్షా 60 వేల జీతం

సౌర పార్కుల ఏర్పాటు: పెద్ద ఎత్తున సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి దేశంలో సుమారు 70 సౌర పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో  రాజస్థాన్ లోని భడ్లా సోలార్ పార్క్, గుజరాత్ లోని ఖావ్డా హైబ్రిడ్ పార్క్ ఉన్నాయి. 

మన దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు (వరుసగా): రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​. 

ప్రపంచంలో సౌరశక్తి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మొదటి ఐదు దేశాలు (వరుసగా): చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, భారతదేశం, జపాన్, జర్మనీ.