
- సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే సమస్యే లేదు: మోదీ
న్యూఢిల్లీ: సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే సమస్యే లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘మా నీళ్లు మా దేశ ప్రయోజనాలకు, దేశాభివృద్ధికే వాడుకుంటం’ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సింధూ జలాల్లో మన వాటా కూడా మనకు పూర్తిగా దక్కేది కాదని, మెజారిటీ వాటా నీళ్లు పాక్ లోకి వెళ్లిపోయేవని ఆరోపించారు.
కానీ, ఇప్పుడు మన జలాల్లోని ప్రతి చుక్కా మన ప్రయోజనాలకే, మన దేశాభివృద్ధికే ఉపయోగ పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ వివరించారు. సింధూ జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ కు ఇవ్వబోమని పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ మోదీ ఈ కామెంట్స్ చేశారు. కాగా, పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అన్ని మార్గాల్లో పాక్ పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.