వ్యాక్సినేషన్‌లో అమెరికాను దాటేసిన భారత్

వ్యాక్సినేషన్‌లో అమెరికాను దాటేసిన భారత్

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. టీకా ఉత్పత్తిని పెంచాలని వ్యాక్సిన్ సంస్థలకు ఆదేశాలిచ్చిన కేంద్రం.. అందుబాటులో ఉన్న టీకాలను వయస్సుల వారీగా ప్రజలకు ఇస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికాను అధిగమించి భారత్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు యూఎస్‌ తమ ప్రజలకు 32.3 కోట్ల టీకా డోసులు ఇవ్వగా.. భారత్‌ 32.36 కోట్ల వ్యాక్సిన్ డోసులతో ముందంజలో నిలిచింది. ఫ‌లితంగా ప్రపంచంలోనే భారత్ అత్య‌ధిక టీకాలు వేసిన‌ దేశంగా అవతరించింది. గ్లోబల్ వ్యాక్సిన్ ట్రాకర్ అందించిన నివేదిక ప్రకారం బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, భారత్‌ల్లో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగంగా కొన‌సాగుతోంది. కాగా, మన దేశ జనాభాలో 18 ఏళ్లు పైబడిన వారిలో  దాదాపు 5.6 శాతం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారు. అదే యూఎస్‌ జనాభాలో సుమారు 40 శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారని సమాచారం. ఇండియాలో గత వారం రోజుల్లో 3.91 కోట్ల డోసులను ప్రజలకు ఇచ్చారని తెలుస్తోంది. ఇది కెనడా, మలేషియా, సౌదీ అరేబియా లాంటి దేశాల మొత్తం జనాభాతో సమానం కావడం విశేషం.