ఒమిక్రాన్ వేరియంట్‌పై అప్రమత్తమైన భారత్

ఒమిక్రాన్ వేరియంట్‌పై అప్రమత్తమైన భారత్

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. గత 24 గంటల్లో 8 వేల 774 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 9 వేల 481 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 621 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా లక్షా 5 వేల 691  యాక్టివ్ కేసులున్నాయి. ఇది 543 రోజుల కనిష్ట స్థాయి. కరోనాతో ఇప్పటి వరకు 4 లక్షల 68 వేల 554 చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు వంద కోట్ల 94 లక్షల 71 వేల 134 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామన్నారు అధికారులు. 

మరోవైపు సౌతాఫ్రికాలో కొత్తగా గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు సైతం పని చేయకపోవచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించిన నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిన్న ఉన్నతాధికారులతో దాదాపు రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ వేరియంట్ భారత్‌లో వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తేసే విషయంలో మరోసారి సమీక్ష చేయాలని చెప్పారు. దేశంలో వచ్చే ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసి, శాంపిల్స్ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించారు.