- ఉత్పత్తిలో పీఎస్యూలదే ఆధిపత్యం
- ఎగుమతుల్లో ప్రైవేట్ రంగమే ఫస్ట్
న్యూఢిల్లీ: మన దేశ రక్షణ రంగం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.54 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు కూడా రికార్డు స్థాయిలో రూ. 23,622 కోట్లకు చేరాయి. ఉత్పత్తి, ఎగుమతుల్లో ఈ పెరుగుదల రక్షణ రంగంలో స్వావలంబన (ఆత్మనిర్భరత) దిశగా ముందడుగు అని కేంద్రం గురువారం తెలిపింది. దేశీయ ఉత్పత్తి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,27,434 కోట్లు కాగా, 2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 174 శాతం పెరిగింది. మొత్తం ఉత్పత్తిలో రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు (డీపీఎస్‌యూలు), ఇతర పీఎస్‌యూల వాటా సుమారు 77 శాతం ఉండగా, ప్రైవేట్ రంగం వాటా 23 శాతం ఉంది. ఎగుమతుల విషయంలో మాత్రం ప్రైవేట్ రంగం పీఎస్‌యూలను అధిగమించింది.
ప్రైవేట్ రంగం రూ. 15,233 కోట్లకు పైగా వాటాతో మొదటిస్థానంలో ఉంది. రక్షణరంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు సుమారు రూ. 8,389 కోట్ల విలువైన ప్రొడక్టులను ఎగుమతి చేశాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 193 రక్షణ కాంట్రాక్టులు కుదిరాయి. వీటి విలువ రూ. 2,09,050 కోట్లు. ఈ ఒప్పందాలలో దేశీయ పరిశ్రమలకు సుమారు రూ. 1.69 లక్షల కోట్ల విలువైన 177 కాంట్రాక్టులు లభించాయి. దేశీయ సామర్థ్యం పెరగడంతో, భారతదేశం ఇప్పుడు తన రక్షణ అవసరాలలో కనీసం 65 శాతం స్థానిక ఉత్పత్తిదారుల నుంచి పొందుతోంది. గతంలో 65–70 శాతం పరికరాలను దిగుమతి చేసుకునేది.
రూ. 3 లక్షల కోట్ల రక్షణ ఉత్పత్తి లక్ష్యం
2029 సంవత్సరం నాటికి రక్షణ తయారీని రూ. మూడు లక్షల కోట్లకు, రక్షణ ఎగుమతులను రూ. 50 వేల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మనదేశంలోని డిఫెన్స్ సెక్టార్లోని కంపెనీలు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు, జలాంతర్గాములు, క్షిపణులు, ట్యాంకులు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ పరికరాలు, తుపాకులు వంటివి తయారు చేస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, అర్మేనియాతో సహా 100కు పైగా దేశాలకు అమ్ముతున్నాయి.
2025లో ఇప్పటి వరకు రక్షణ రంగ కంపెనీల స్టాక్‌లు కూడా ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను అందించాయి. పీఎస్‌యూలలో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్‌ఏఎల్) షేర్ ధర ఈ ఏడాది ఇప్పటి వరకు 13.57 శాతం పెరిగింది. భారత్ డైనమిక్స్ (బీడీఎల్) 37.24 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) 44.78 శాతం మేర లాభపడ్డాయి. ప్రైవేట్ రక్షణ రంగంలో, భారత్ ఫోర్జ్ ఈ ఏడాది 11.02 శాతం పెరిగింది. పారస్ డిఫెన్స్ 48.13 శాతం దూసుకెళ్లింది.
