
బర్మింగ్ హోమ్ వేదికగా ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ లో టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం (జూలై 6) ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై 336 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. విదేశాల్లో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్ కు ముందు ఇప్పటివరకు ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ లో ఒక్క విజయం కూడా లేకుండా బరిలోకి దిగిన మన జట్టు.
.. ఏకంగా రికార్డ్ విజయాన్ని అందుకోవడం హైలెట్ గా నిలిచింది. ఇప్పటివరకు దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డ్ ను గిల్ సుసాధ్యం చేసి చూపించాడు.
భారత్ జట్టు ఈ మ్యాచ్ కు ముందు గతంలో ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. వీటిలో ఏడింటిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా చేసుకోగలిగింది. బర్మింగ్‌హామ్‌లో తొలిసారి 1967లో పటౌడీ కెప్టెన్సీలో ఆడితే ఆ మ్యాచ్ లో 132 పరుగుల తేడాతో ఓడిపోయింది. కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1986లో మాత్రమే డ్రా చేసుకోగలిగింది. అజిత్ వాడేకర్, వెంకట్ రాఘవన్, మహమ్మద్ అజారుద్దీన్,మహేంద్ర సింగ్ ధోనీ, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ సారధ్యంలో టీమిండియాకు ఈ గ్రౌండ్ లో విజయం దక్కలేదు.
ఈ విజయంతో ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు ఈ వేదికపై ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక జట్లు కలిసి 18 మ్యాచ్ లు ఆడినా విజయం సాధించలేకపోయాయి. అయితే గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్ ను చిత్తు చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడం విశేషం. తన అద్భుతమైన బ్యాటింగ్ తో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 430 పరుగులు చేసిన గిల్.. కెప్టెన్సీతోనూ అదరగొట్టాడు. తొలి టెస్టులో ఓడిపోయిన టీమిండియాకు రెండో టెస్ట్ విజయం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనే చెప్పాలి.
ALSO READ : వరల్డ్ బాక్సింగ్ కప్‌లో ..ఇండియా బాక్సర్లకు 11 మెడల్స్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అత్యద్భుత బ్యాటింగ్‌కు తోడు ఆకాశ్ దీప్ (10/187) రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి పది వికెట్లతో కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో విజృంభించడంతో ఐదో రోజు, ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 336 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌పై అఖండ విజయం అందుకుంది. ఇండియా ఇచ్చిన 608 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 72/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లిష్ టీమ్ 68.1 ఓవర్లలో 271 కే కుప్పకూలి చిత్తుగా ఓడింది. దాంతో ఇండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 587 పరుగులు చేస్తే.. బదులుగా ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి టీమిండియా 427 వద్ద డిక్లేర్ చేసింది. 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది.