
India US Trade Deal: గతనెల అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై భారీగా సుంకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా దేశాలపై వాటిని తాత్కాలికంగా నిలిపివేసిన ట్రంప్ ప్రస్తుతం ఒక్కో దేశంతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే చైనాతో డీల్ ముగియగా.. భారతదేశ బృందం కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ నేతృత్వంలో అమెరికా అధికారులతో చర్చలు మెుదలుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఖతార్ దోహాలో పర్యటనలో ఉన్న ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. అమెరికాతో జీరో టారిఫ్స్ వాణిజ్యానికి భారత్ అంగీకరించిందని ప్రకటించారు. దీనికి సంబంధించి ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించటం భారతీయ స్టాక్ మార్కెట్లలో నిద్రపోతున్న బుల్స్‌ని తట్టి లేపింది. దీంతో అమెరికా వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండబోవని ట్రంప్ ప్రకటించారు. భారతదేశంలో అమెరికా ఉత్పత్తులను విక్రయించటం చాలా కష్టతరంగా మారిందని అయితే ప్రస్తుతం జీరో టారిఫ్స్ డీల్ అమెరికా వ్యాపార సంస్థలకు వ్యాపార అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు.
దీనికి ముందు గత నెలలో ట్రంప్ భారతదేశంపై 26 శాతం రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత వాటిని తాత్కాలికంగా నిలుపుదలలో ఉంచినప్పటికీ బేసిక్ టారిఫ్ 10 శాతం సుంకాలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా భారత స్టీల్, అల్యూమినియంపై సుంకాలను ప్రకటించటంతో ఆగ్రహంగా ఉన్న ఇండియా ప్రపంచ వాణిజ్య సంస్థ దగ్గరకు విషయాన్ని తీసుకెళ్లటంతో పాటు మరిన్ని అమెరికా వస్తువులపై సుంకాలను పెంచాలని కూడా ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చేసిన జీరో టారిఫ్స్ ట్రేడ్ డీల్ పై భారత వర్గాలు స్పందించాయి. ప్రస్తుతానికి వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదని, ఇది ఇప్పటికీ చర్చల దశలోనే ఉన్నట్లు సీఎన్ఎన్ న్యూస్ 18 నివేదించింది. అలాగే భారత్ బియ్యం, పప్పుధాన్యాల విషయంలో చర్చలకు అంగీకరించలేదని కూడా తెలుస్తోంది. అయితే భారత వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. మెుత్తానికి ట్రంప్ కొంత అత్యుత్సాహం ప్రదర్శించారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ ఇండియా, పాక్ అధికారిక ప్రకటనకు మునుపే ట్రంప్ ట్వీట్ చేసి యుద్ధాన్ని ఆపినట్లు క్లెయిమ్ చేశారు. ఆ తర్వాత కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పగా భారత్ తోసిపుచ్చింది. అలాగే యుద్ధం సమయంలో అమెరికా ఆయుధాలు లేదా సహాయాన్ని భారత్ కోరకపోవటం వంటి అంశాలు పెద్దన్న పాత్రలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కొంత మింగుపుడు పడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కక్షతోనే ఐఫోన్ల తయారీని ఇండియా నుంచి దూరం చేయాలని చూస్తున్నట్లు ట్రంప్ దోహా కామెంట్స్ నుంచి విశ్లేషలు అర్థమౌతోందంటున్నారు.