24 గంటల్లో 2 వేల 151 మందికి కరోనా..

24 గంటల్లో 2 వేల 151 మందికి కరోనా..

దేశంలో కరోనా బారిన పడుతున్న జనం సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. 24 గంటల్లోనే అంటే.. 2023, మార్చి 28వ తేదీ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 2 వేల 151 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 12 వేలకు చేరింది. సైలెంట్ గా విస్తరిస్తున్న మహమ్మారిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 2 వేల 151 మంది కరోనా బారిన పడగా.. 12 వందల మంది రికవరీ అయ్యారని స్పష్టం చేసింది కేంద్రం. 

ఒకే రోజు 2 వేల పాజిటివ్ కేసలు నమోదు కావటం 152 రోజుల తర్వాత ఇదేనని.. గత రెండు సీజన్స్ లోనూ ఎండాకాలంలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని.. ఈసారి కూడా ఆ సంకేతాలు కనిపిస్తున్నాయంటూ.. అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. ఫస్ట్, సెకండ్ వేవ్స్ కూడా ఎండాకాలంలో విజృంభించాయి.. గత ఏడాది తీవ్రత అంతగా లేకపోయినా.. ఈ సారి మాత్రం కేసుల సంఖ్య క్రమంగా పెరగటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో రివ్యూ మీటింగ్ నిర్వహించింది.

ఇదే క్రమంలో ముంబైలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వార్డులు రీఓపెన్ చేయటం చూస్తుంటే.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ భయపడుతున్నట్లే మళ్లీ కరోనా వేవ్ వస్తుందా అనేది అందరిలో భయాందోళలకు గురి చేస్తుంది. జనం అప్రమత్తంగా ఉంటూ.. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.