రష్యాతో భారత రక్షణ బంధం

రష్యాతో భారత రక్షణ బంధం

 

  •     21వ ‘ఇండియా–రష్యా యాన్యువల్​ సదస్సు’లో డీల్​ 
  •     ప్రధాని మోడీతో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ భేటీ
  •     ఢిల్లీలో ఇరు దేశాల డిఫెన్స్, ఫారిన్ మినిస్టర్ల చర్చలు

న్యూఢిల్లీ: దశాబ్దాలు గడిచిపోయినా ఇండియా, రష్యా మధ్య స్నేహ బంధం చెక్కుచెదరలేదని, రెండు దేశాల మధ్య ఫ్రెండ్ షిప్ కాలపరీక్షకు ఎదురొడ్డి నిలబడిందని ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఇండియా–రష్యా 21వ యాన్యువల్ సమిట్ లో పాల్గొనేందుకు పుతిన్ సోమవారం ఢిల్లీకి వచ్చారు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ కు చేరుకున్న ఆయనకు ప్రధాని మోడీ గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. ఆ తర్వాత జరిగిన యాన్యువల్ సమిట్ లో నేతలు రెండు దేశాల మధ్య రిలేషన్స్, అఫ్గానిస్తాన్ లో సంక్షోభం సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో 4 ఒప్పందాలు జరిగాయి.  రెండు దేశాల స్ట్రాటజిక్ పార్ట్​నర్ షిప్​ మరింత పటిష్టం అయిందని, అఫ్గానిస్తాన్ సహా అనేక అంశాలపై రెండు దేశాలు టచ్ లోనే ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. ‘‘గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచ దేశాల మధ్య సంబంధాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఇండియా, రష్యాల ఫ్రెండ్​ షిప్ మాత్రం అలాగే నిలిచి ఉంది. కరోనా విపత్తు మొదలైన తర్వాత మీరు (పుతిన్) బయటి దేశానికి రావడం ఇది రెండోసారి మాత్రమే. ఇక్కడికి మీ (పుతిన్) రాక.. మాతో సంబంధాల పట్ల కమిట్ మెంట్ ను చూపుతోంది” అని మోడీ మెచ్చుకున్నారు.  

ఇండియా.. గ్రేట్ పవర్ 
మోడీతో సమావేశంలో టెర్రరిజం, డ్రగ్స్ అక్రమ రవాణా, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ తదితర అంశాలపై చర్చించానని పుతిన్ చెప్పారు. అఫ్గాన్ లో సంక్షోభంపైనా చర్చించామని, ఈ ప్రాంతంలో ప్రధాన సవాళ్లను ఎదుర్కోవడంలో రెండు దేశాలు ఇకముందూ కలిసి ముందుకు సాగుతాయన్నారు. ‘‘ఇండియా ఒక గొప్ప శక్తి. ఫ్రెండ్లీ దేశం. కాలపరీక్షకు నిలిచిన దోస్త్” అని పుతిన్ అన్నారు. ఎన్విరాన్‌‌మెంట్, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ వంటి రంగాల్లోనూ రెండు దేశా మధ్య సహకారం పెరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం రెండు వైపులా పెట్టుబడులు 3,800 కోట్ల డాలర్లకు చేరాయని, రష్యా నుంచి మరిన్ని ఇన్వెస్ట్ మెంట్లు వస్తాయని పుతిన్​ చెప్పుకొచ్చారు.   

తొలిసారి ‘2+2’ చర్చలు
యాన్యువల్ సమిట్ కు ముందుగా రెండు దేశాల డిఫెన్స్, ఫారిన్ మినిస్టర్లతో సమావేశం జరిగింది. స్ట్రాటజికల్ గా ముఖ్యమైన విషయాలపై సమావేశంలో రెండు దేశాల మంత్రులు చర్చించారు. దీనికి ముందుగా రెండు దేశాల డిఫెన్స్ మినిస్టర్లు రాజ్ నాథ్ సింగ్, సెర్గీ షోయ్గూ ‘మిలిటరీ, టెక్నికల్ సహకారంపై ఇండియా- రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ ఎం అండ్ ఎంటీసీ)’ 20వ మీటింగ్ లో పాల్గొన్నారు. రక్షణ రంగంలో సహకారం మరింత పెంచుకోవాలని, రెండు దేశాలు సంయుక్తంగా మిలిటరీ ఎక్విప్ మెంట్ తయారీ చేపట్టాలని మీటింగ్ లో నిర్ణయించారు. అలాగే ఫారిన్ మినిస్టర్లు ఎస్. జైశంకర్, సెర్గీ లావ్ రోవ్ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆ తర్వాత  ‘2+2’ డైలాగ్ లో భాగంగా నలుగురు మంత్రులు కలిసి సమావేశమయ్యారు. ఇండియా, రష్యా మధ్య  ‘2+2’ చర్చలు జరగడం ఇదే మొదటిసారి. 

6 లక్షల ఏకే 203 రైఫిళ్లు  
రక్షణ రంగంలో సహకారానికి సంబంధించి ఇండియా, రష్యా మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. ఐఆర్ఐజీసీ ఎం అండ్ ఎంటీసీ 20వ మీటింగ్ లో ఈ మేరకు ఇరు దేశాలు అగ్రిమెంట్లపై సంతకాలు చేశాయి. యూపీ అమేథీలోని ఫ్యాక్టరీలో 6,01,427 ఏకే- 203 రైఫిల్స్ ను సంయుక్తంగా తయారు చేసేందుకు ఓ అగ్రిమెంట్ పై ఇరుదేశాలు సంతకం చేశాయి. మన సాయుధ బలగాలకు అందించే ఈ రైఫిల్స్ తయారీకి రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. మరో పదేండ్లు మిలిటరీ కోఆపరేషన్ కొనసాగించడానికి సంబంధించి మరో అగ్రిమెంట్ కుదిరింది. ఐఆర్ఐజీసీ ఎం అండ్ ఎంటీసీ మీటింగ్ ప్రొటోకాల్ తో పాటు మరో అంశంపై రెండు అగ్రిమెంట్లు కుదిరాయి.