ఏకే–203 రైఫిల్స్ తయారీకి భారత్, రష్యా ఒప్పందం  

ఏకే–203 రైఫిల్స్ తయారీకి భారత్, రష్యా ఒప్పందం  

న్యూఢిల్లీ: భారత్, రష్యాలు కీలక ఒప్పందంపై సంతకం చేశాయి. దాదాపు 6 లక్షలకు పైగా ఏకే–203 గన్ ల తయారీకి ఇరు దేశాలు ఓకే చెప్పాయి. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీలో రూ.5 వేల కోట్లకు పైగా వ్యయంతో ఈ అత్యాధునిక రైఫిళ్లను తయారు చేసేందుకు అంతా సిద్ధమైంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఈ రైఫిళ్లను దేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు. మిలటరీ, టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ 2021–31 కింద ఇండో–రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రైఫిళ్లను తయారు చేయనుంది. తాజా డీల్ తో రైఫిళ్ల తయారీకి సంబంధించిన డేటాను రష్యా భారత్ కు బదలాయించనుంది.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ జనరల్ సెర్జే షోగూలు ఇరు దేశాల తరఫున ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఏకే–203 రైఫిళ్లతోపాటు కలషింకోవ్ ఆయుధాల తయారీ ఒప్పందం మీదా రాజ్ నాథ్, సెర్జేలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ.. భారత్, రష్యా సంబంధాల్లో డిఫెన్స్ కోఆపరేషన్ చాలా కీలకమన్నారు. రక్షణ రంగంలో పరస్పర సాయం ముఖ్యమన్న ఆయన.. భారత్ కు బలమైన మద్దతును ఇస్తున్నందుకు రష్యాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యంతో ఈ రీజియన్ లో సుస్థిరత, శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. 

ఏకే203 ఎందుకు స్పెషల్?

ఏకే–47 గురించి వినే ఉంటారు. ఇదొక అస్సాల్ట్ రైఫిల్. దాదాపు ఏడు దశాబ్దాల కింద సోవియట్ యూనియన్ లో దీన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ గన్ చాలా ఫేమస్. తాజాగా దీనికి సరికొత్త వెర్షన్ వచ్చింది. దాన్ని ఏకే–203గా పిలుస్తున్నారు. ఏకే–47తో పోల్చితే ఏకే–203 అత్యాధునికమైనది. అలాగే ఎంతో తేలికైనది, శక్తిమంతమైనది. 3.8 కేజీల బరువున్న ఈ తుపాకీతో 400 మీటర్ల నుంచి 800 మీటర్ల రేంజిలో ఎఫెక్టివ్ గా కాల్పులు జరిపే వీలుంటుంది. 300 మీటర్ల వరకు అయితే కచ్చితంగా గురితప్పకుండా కాల్చవచ్చు. దీనికి 30 రౌండ్ డిటాచబుల్ బాక్స్ మ్యాగజైన్, 50 రౌండ్ డిటాచబుల్ క్వాడ్ కాలమ్ మ్యాగజైన్లను అమర్చుకోవచ్చు. నిమిషానికి 700 రౌండ్లు కాల్పులు జరపడం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు.