దూసుకెళ్లిన జీడీపీ... జూన్ క్వార్టర్లో 7.8 శాతంగా నమోదు

దూసుకెళ్లిన జీడీపీ... జూన్ క్వార్టర్లో 7.8 శాతంగా నమోదు
  • గత ఐదు క్వార్టర్లలో ఇదే అత్యధికం

న్యూఢిల్లీ: భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–​-జూన్​ కాలంలో 7.8 శాతంగా నమోదైంది. గత ఐదు క్వార్టర్లలో ఇదే అత్యధిక వృద్ధి. వ్యవసాయ రంగం మెరుగైన పనితీరు, వాణిజ్యం, హోటల్, ఆర్థికం, రియల్ ​ ఎస్టేట్​లాంటి సేవల రంగాల ఎదుగుదల వల్ల ఆర్థిక వృద్ధి పుంజుకుందని ప్రభుత్వ డేటా వెల్లడించింది. అయితే టారిఫ్​ల వల్ల టెక్స్​టైల్స్, రొయ్యల వంటి​  ఎగుమతులపై ప్రభావం పడొచ్చని నేషనల్​ స్టాటిస్టిక్స్​ ఆఫీస్​(ఎన్​ఎస్​ఓ) రిపోర్ట్​ తెలిపింది. దీని ప్రకారం 2024–-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్​ కాలంలో 1.5 శాతంగా ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో 3.7 శాతానికి పెరిగింది.  

తయారీ రంగం వృద్ధి స్వల్పంగా పెరిగి 7.7 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో ఇది 7.6 శాతం ఉంది. మనదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఏప్రిల్–-జూన్​ కాలంలో చైనా జీడీపీ వృద్ధి 5.2 శాతంగా ఉంది. ఈ నెలలో ఆర్​బీఐ 2025–-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. మొదటి క్వార్టర్​లో 6.5 శాతం, రెండో క్వార్టర్​లో 6.7 శాతం, మూడో క్వార్టర్​లో 6.6 శాతం, నాలుగో క్వార్టర్​లో 6.3 శాతం ఉండొచ్చని పేర్కొంది. 

సత్తా చాటిన సేవల రంగం

ఈసారి సేవల రంగం వృద్ధి రేటు 9.3 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఇది 6.8 శాతంగా ఉంది. సేవల రంగంలో వాణిజ్యం, హోటల్, రవాణా, ఆర్థిక సంస్థలు, రియల్​ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు, ప్రభుత్వ పరిపాలన,  రక్షణ ఉన్నాయి. ఖనిజాలు, తవ్వకాల రంగం వృద్ధి -3.1 శాతం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా,  ఇతర సేవల రంగం వృద్ధి 0.5 శాతం తగ్గింది. ఈ విషయమై ఐసీఆర్​ఏ ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ మాట్లాడుతూ,  రాబోయే త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం, యూఎస్​ టారిఫ్​, జరిమానాల ప్రభావం వల్ల ఎగుమతులు మందగించవచ్చని తెలిపారు.  

29 శాతానికి చేరిన ద్రవ్యలోటు 

ఈ ఏడాది జులై చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు మొత్తం ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 29.9 శాతానికి పెరిగింది. అంతకు  ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది బడ్జెట్ అంచనాల్లో 17.2 శాతంగా ఉందని కంట్రోలర్​జనరల్​ ఆఫ్​ అకౌంట్స్​(సీజీఏ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​ (ఏప్రిల్-జూన్) ముగిసే సమయానికి ఆర్థిక లోటు పూర్తి సంవత్సర లక్ష్యంలో 17.9 శాతంగా నమోదైంది. ఈసారి ఏప్రిల్-జులై కాలంలో ఆర్థిక లోటు రూ. 4,68,416 కోట్లుగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు జీడీపీలో 4.4 శాతం లేదా రూ. 15.69 లక్షల కోట్లుగా ఉంటుందని కేంద్రం అంచనా వేసింది.