న్యూఢిల్లీ: వేగంగా వస్తువులను డెలివరీ చేసే క్విక్ కామర్స్ మార్కెట్ వచ్చే ఐదేళ్లలో 5-–7 రెట్లు పెరిగి, 2030–-31 నాటికి 70–-90 బిలియన్ డాలర్ల (రూ.8.64 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని గూగుల్, - రెడ్‌సీర్ కలిసి విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది. దేశ మొత్తం రిటైల్ రంగంలో క్విక్ కామర్స్ వాటా 5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, 2025–26లో 13 బిలియన్ డాలర్లు (1.24 లక్షల కోట్లు) గా ఉన్న ఈ రంగం, ఏటా 41–-48శాతం వృద్ధి రేటు నమోదు చేయనుంది.
నెలకు లావాదేవీలు జరిపే యూజర్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 4.4 కోట్ల నుంచి 10 కోట్లకు పైగా పెరగనుంది. ఈ వృద్ధిలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా టాప్-8 మెట్రోల వాటా దాదాపు 60శాతం (రూ.5.76 లక్షల కోట్లు) కాగా, నాన్-మెట్రో నగరాలు మిగిలిన 40శాతం (రూ.3.16 లక్షల కోట్ల) వాటాను భర్తీ చేయనున్నాయి.
నాన్-మెట్రో యూజర్లు 4-–5 రెట్లు పెరిగి 1.6 కోట్ల నుంచి 6 కోట్లకు చేరనున్నారు. నిత్యావసర సరుకులతో పాటు ఎలక్ట్రానిక్స్, బ్యూటీ ప్రొడక్ట్‌లకు విస్తరించడం మెట్రోల్లో వృద్ధిని పెంచనుండగా, క్యాష్ ఆన్ డెలివరీ, స్థానిక భాషా సపోర్ట్ ద్వారా చిన్న నగరాల్లో క్విక్ కామర్స్ విస్తరించనుందని గూగుల్–రెడ్‌సీర్ రిపోర్ట్ పేర్కొంది.
