న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో రష్యా నుంచి లి క్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) కొనుగోలుకు భారత్సన్నాహాలు చేస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. రష్యా నుంచి ఎల్ఎన్‌జీ దిగుమతులను అనుమతించేలా అమెరికాను భారత్ మినహాయింపు కోరింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమల్లోకి వచ్చిన పాశ్చాత్య ఆంక్షల నేపథ్యంలో ఈ చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా నుంచి నేరుగా ఎల్ఎన్‌జీ సరఫరా పునఃప్రారంభంపై భారత్, రష్యా మధ్య చర్చలు ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
మార్చి 19న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో రష్యా ఉప ఇంధన మంత్రి పావెల్ సొరోకిన్, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ అంశంపై చర్చించారు. ఎల్ఎన్‌జీ ఒప్పందాన్ని అన్వేషించేందుకు ఇరు దేశాలు ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. దేశీయ దిగుమతి సంస్థలను కూడా రష్యా ఎల్ఎన్జీ కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని భారత్ సూచించింది
