
- తమిళనాడు పోర్టులో పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
- 103 డ్రమ్ముల్లో 2,560 కిలోల నిషేధిత రసాయనాలు
న్యూఢిల్లీ: చైనా నుంచి తమిళనాడు మీదుగా పాకిస్తాన్ వెళ్తున్న ఓ షిప్ నుంచి భారీ మొత్తంలో ఆర్థో క్లోరో బెంజిలిడిన్ మలోనోనిట్రైల్ (సీఎస్) అనే కెమికల్ డబ్బాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కెమికల్‌ను టియర్ గ్యాస్ తయారీలో ఉపయోగిస్తారు. అదేవిధంగా, అల్లర్లు నియంత్రించే ఏజెంట్‌గా కూడా యూజ్ చేస్తారు. దీనిని చైనాకు చెందిన షిప్‌గా అధికారులు గుర్తించారు. మొత్తం 103 డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2,560 కిలోల కెమికల్ ఉన్నట్లు తెలిపారు.
దీన్ని 2024, ఏప్రిల్ 18న చైనాకు చెందిన చెంగ్డు షిచెన్ ట్రేడింగ్ కో.లిమిటెడ్ కంపెనీ.. పాకిస్థాన్ రావల్పిండికి చెందిన డిఫెన్స్ సప్లైయర్ రోహైల్ ఎంటర్ ప్రైజైస్కు పంపినట్టు డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమైంది. 103 కెమికల్ డ్రమ్ములతో హ్యుందాయ్ షాంఘై అనే షిప్.. సైప్రస్ జెండాతో షాంఘై నుంచి బయలుదేరింది. ఒక్కో డ్రమ్‌లో 25 కిలోల చొప్పున కెమికల్ ఉన్నది. కరాచీకి వెళ్తున్న ఈ షిప్.. 2024, మే 8న తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు చేరుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా షిప్‌ను చెక్ చేయగా.. పెద్ద మొత్తంలో కెమికల్ డబ్బాలను అధికారులు గుర్తించారు.