శుభ్ మన్ గిల్ సెంచరీ..కివీస్ టార్గెట్ 235 పరుగులు

శుభ్ మన్ గిల్ సెంచరీ..కివీస్ టార్గెట్ 235 పరుగులు

సిరీస్ డిసైడర్ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మన్ దుమ్ము రేపారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది.  దీంతో న్యూజిలాండ్ కు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.  

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే వికెట్ నష్టపోయింది. బ్రేస్ వెల్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ LBWగా వెనుదిరిగాడు. ఈ సమయంలో గిల్కు జతకలిసిన రాహుల్ త్రిపాఠి..చిచ్చరపిడుగుల చెలరేగాడు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 44 పరుగులు సాధించాడు. గిల్తో కలిసి రెండో వికెట్కు 80 పరుగులు జత చేశాడు. ఈ క్రమంలోనే సోధీ బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. దీంతో భారత్ 87 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ..వచ్చి రాగానే సిక్స్ బాదాడు. అయితే ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. 24 పరుగులు చేసిన సూర్య..టిక్నర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 

గిల్ సెంచరీ..

ఈ సమయంలో శుభ్ మన్ గిల్ చెలరేగాడు. సూర్య ఔటైన తర్వాత రెచ్చిపోయాడు. సిక్సులు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లో 7 ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ చేసిన గిల్.. 50 పరుగులు చేశాడు. మరో 19 బంతుల్లోనే మిగతా 50 పరుగులు చేయడం విశేషం. మొత్తంగా 54 బంతుల్లో 101 పరుగులు సాధించాడు. ఇందులో 5 సిక్సర్లు, 10 ఫోర్లు ఉండటం విశేషం. చివరి వరకు క్రీజులో ఉన్న గిల్..63 బంతుల్లో 126 పరుగులు చేసి భారత్ 234 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.  30 పరుగులు చేసిన పాండ్యా చివర్లో వెనుదిరిగాడు. కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, టిక్నర్, మిచెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.