లీడ్స్: విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. బుధవారం జరిగే కీలక పోరులో నెదర్లాండ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ, బ్యాటింగ్ విభాగంలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని మరింత పటిష్టమైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్ సేన మైదానంలోకి దిగనుంది.
తొలి మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధాన, లోయర్ ఆర్డర్‌లో రిచా ఘోష్ బాధ్యతాయుతంగా రాణించి జట్టును గెలిపించారు. అయితే మరో ఓపెనర్ షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. మిడిల్ ఆర్డర్‌లో కీలకమైన భారతి ఫుల్మాలి సైతం నిరాశపరిచింది. కాబట్టి లీగ్ దశలో బలమైన జట్లతో మ్యాచ్‌లు ఉన్నందున, ఇండియా బ్యాటర్లు మరింత స్థిరత్వాన్ని ప్రదర్శించాల్సి ఉంది.
నెదర్లాండ్స్‌పై గెలవడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోయినప్పటికీ, సెమీఫైనల్‌కు చేరాలంటే లీగ్ దశలో ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా వంటి బలమైన జట్లలో ఒకరిని కచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది. ఇండియా పేసర్లు అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే స్పిన్ ద్వయం దీప్తి శర్మ, శ్రీ చరణి అద్భుత ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి గత మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టారు. మరోవైపు బంగ్లాదేశ్ చేతిలో ఓడిన నెదర్లాండ్స్ ఈ మ్యాచ్‌లో ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
